Noida twin towers: కుప్పకూలిన నోయిడా ట్విన్‌ టవర్స్‌

Noida twin towers: అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన నోయిడా జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయ్యింది.

Updated : 28 Aug 2022 16:58 IST

Noida twin towers: అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన నోయిడా జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయ్యింది. ముందు ఖరారు చేసినట్లుగా ఆదివారం సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటలకు ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేశారు. పోలీసుల నుంచి క్లియరెన్స్‌ రాగానే.. మీట నొక్కి పేలుళ్లు జరిపారు. మీట నొక్కేచోట ముగ్గురు విదేశీ నిపుణులు, పేల్చివేతల కంపెనీకి చెందిన చేతన్‌ దత్తా, ఓ పోలీసు అధికారి, ఎడిఫిస్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ మయూర్‌ మెహతా ఉన్నారు.

సూపర్‌టెక్‌ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ జంట భవనాల కూల్చివేతకు ముందు స్థానికులందరినీ అధికారులు, పోలీసులు అక్కడి నుంచి తరలించారు. వాహనాలు, పెంపుడు జంతువుల్ని సైతం దూర ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం 7 గంటలకే తరలింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొందరు ప్రతినిధులు, ప్రైవేటు సెక్యూరిటీ మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆ ప్రాంతంలో ఉన్నారు. వీరంతా తిరిగి సాయంత్రం 5:30 గంటలకు తమ నివాసాలకు చేరుకోనున్నారు.

ఎలా కూల్చేశారంటే..

ఈ జంట భవనాల కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు.  పేలుడు పదార్థాలను అమర్చేందుకు భవనాల పిల్లర్లలో 7000 రంధ్రాలు చేశారు. 20,000 సర్క్యూట్లు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల నుంచి మీట నొక్కగానే భవనాలు నిలువుగా కుప్పకూలేలా పిల్లర్లు పేలిపోయాయి. దీన్ని ‘వాటర్‌ఫాల్‌ టెక్నిక్‌’గా వ్యవహరిస్తున్నారు. ముంబయికి చెందిన ఎడిఫిస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్‌ డిమాలిషన్స్‌ కలిసి ఈ పని చేపట్టాయి. పేలుడుకు 10 సెకన్లు పట్టింది. తర్వాత నాలుగైదు సెకన్లలో భవనాలు కిందపడిపోయాయి.

55 వేల టన్నుల వ్యర్థాలు..

ఈ కూల్చివేత వల్ల దాదాపు 55 వేల టన్నుల వ్యర్థ పదార్థాలు పోగుపడతాయి. వ్యర్థాల్లో దాదాపు 4 వేల టన్నుల ఉక్కు ఉంటుందని అంచనా. దీన్ని అక్కడి నుంచి తొలగించడానికి మూడు నెలల సమయం పడుతుంది. కూల్చివేతకు 15 నిమిషాల ముందు దగ్గర్లోని గ్రేటర్‌ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై 450 మీటర్ల పరిధిలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఈ జంట భవనాలకు 8 - 12 మీటర్ల వ్యాసార్థంలో మరికొన్ని భవనాలు ఉన్నాయి. వాటిలోకి దుమ్ము చొరబడకుండా, వాటికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు జియో-టెక్స్‌టైల్‌ కవరింగ్‌ ఉపయోగిస్తున్నారు. సుమారు 225 టన్నుల ఇనుప మెష్‌, 110 మీటర్ల పొడవైన జియో-టెక్స్‌టైల్‌ను ఇందుకు వాడారు.

ఎందుకు పేల్చివేశారంటే..

నోయిడాలోని సెక్టార్‌ 93ఏలో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారు. దీనిపై దగ్గర్లోని సూపర్‌టెక్‌ ఎమరాల్డ్‌ కోర్టు సొసైటీవాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించారు. దాదాపు 9 ఏళ్ల పాటు న్యాయపోరాటం కొనసాగించారు. తొలుత ఈ ప్రాంతంలో గార్డెన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వాదించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు నిర్మాణ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చింది. భవనాల్ని కూల్చివేయాలని 2014లో ఆదేశించింది. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. గత ఏడాది ఆగస్టులో అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సమర్థించింది. కూల్చివేతకు మూడు నెలల సమయం ఇచ్చింది. కానీ, సాంకేతికత కారణాల వల్ల ఏడాది సమయం పట్టింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని