
Beijing Olympics: బహిష్కరిస్తారా.. తగిన రీతిలో బదులిస్తాం: చైనా
బీజింగ్: వచ్చే ఏడాది బీజింగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ను అగ్రరాజ్యం అమెరికా, యూకే సహా పలు దేశాలు దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అథ్లెట్లను పంపుతాం గానీ.. తమ దేశాల తరఫున దౌత్యప్రతినిధులను పంపించేది లేదని స్పష్టం చేశాయి. కాగా.. ఆయా దేశాల బహిష్కరణతో తమకేం ఆందోళన లేదని చైనా వెల్లడించింది. ‘‘అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా దేశాలు దౌత్యపరమైన బహిష్కరణ చేసినా మాకేం ఆందోళన లేదు. ప్రపంచంలోని చాలా దేశాలు బీజింగ్ ఒలింపిక్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. కొంతమంది దేశాధినేతలు, రాజకుటుంబీకులు ఒలింపిక్స్ వేడుకలకు హాజరుకానున్నారు’’అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.
ఒలింపిక్స్‌ను అమెరికా.. దాని మిత్ర దేశాలు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని వాంగ్ విమర్శించారు. చేసిన తప్పులకు ఆ దేశాలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దౌత్యపరమైన బహిష్కరణ చేసినందుకు గానూ అమెరికాకు తగిన రీతిలో బదులిస్తామని చైనా వెల్లడించింది. బ్రిటన్, కెనడా ప్రతినిధుల్ని తాము ఆహ్వానించట్లేదని.. వారి ప్రభావం ఒలింపిక్స్ నిర్వహణపై ఏ మాత్రం ఉండదని పేర్కొంది. శీతాకాల ఒలింపిక్స్ బీజింగ్ వేదికగా ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమై 20వ తేదీన ముగియనున్నాయి.
► Read latest National - International News and Telugu News