ఒక డోసు పంపిణీలో.. అమెరికాను దాటేసిన భారత్‌!

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. అమెరికాలో ఒక డోసు తీసుకున్న వారి సంఖ్యను భారత్‌ దాటేసినట్లు పేర్కొంది

Published : 04 Jun 2021 20:09 IST

పాజిటివిటీ రేటు తగ్గుతోందన్న కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. అమెరికాలో ఒక డోసు తీసుకున్న వారి సంఖ్యను భారత్‌ దాటేసినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న అమెరికాలో ఇప్పటివరకు 16.9కోట్ల మందికి ఒక డోసు అందించగా, భారత్‌లో ఈ సంఖ్య 17.2కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ పంపిణీ వివరాలను వెల్లడించిన నీతి ఆయోగ్‌ సభ్యులు (ఆరోగ్యం) వీకే పాల్‌, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ వివరాలను వెల్లడించారు. వ్యాక్సినేషన్‌లో ముందున్న అమెరికాలో ఇప్పటివరకు 16.9కోట్ల మందికి ఒక డోసు అందించారన్నారు. కాగా భారత్‌లో ఇప్పటివరకు 17.2కోట్ల మందికి సింగిల్‌ డోసు ఇచ్చామని తెలిపారు. ఇలా ఒక డోసు తీసుకున్న వారిలో అమెరికాను భారత్‌ అధిగమించిందని వీకే పాల్ పేర్కొన్నారు. బ్రిటన్‌లో 3.9కోట్లు, జర్మనీలో 3.8కోట్ల మందికి తొలి డోసు అందినట్లు తెలిపారు. ఇక చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ వివరాలు తెలియవని చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

22.41కోట్ల డోసులు పంపిణీ..

దేశంలో ఇప్పటివరకు మొత్తం 22.41కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం నాటికి 17.85కోట్ల మందికి తొలిడోసు అందింది. 60ఏళ్ల వయసు పైబడిన వారిలో సింగిల్‌ డోసు తీసుకున్న వారి సంఖ్య 43శాతానికి చేరింది. వేర్వేరు అనారోగ్య సమస్యలు ఉంటాయని  భావించి, టీకాలు వేసేటప్పుడు తొలుత వృద్ధులకే ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వయో వృద్ధులు వ్యాక్సిన్‌కోసం ముందుకు వచ్చేలా విజ్ఞప్తి చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

7.27శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు..

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. గత నెల 4వ తేదీన 21.62శాతంగా ఉన్న వారాంతపు పాజిటివిటీ రేటు, ప్రస్తుతం 7.27కు తగ్గినట్లు చెప్పారు. వీటితో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అన్నారు. గత నెల 1వ తేదీన రికవరీ 81.8 శాతం ఉండగా, ప్రస్తుతం 93.1కి పెరిగిందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని