Solar Scheme: ‘పీఎం సూర్య ఘర్‌’.. నెలలోనే కోటి దాటిన రిజిస్ట్రేషన్లు

‘పీఎం సూర్య ఘర్‌’ పథకం కోసం నమోదు చేసుకున్న కుటుంబాల సంఖ్య ఇప్పటికే కోటి దాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

Published : 16 Mar 2024 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తరించి, పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన (PM Surya Ghar)’ పథకానికి కేంద్రం ఇటీవల శ్రీకారం చుట్టింది. దీనిద్వారా కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కోసం నమోదు చేసుకున్న కుటుంబాల సంఖ్య ఇప్పటికే కోటి దాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వెల్లడించారు. ఒక నెలలోనే ఈస్థాయి స్పందన లభించిందని, ఇదొక అద్భుతమైన వార్త అని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

ఉచిత విద్యుత్‌ పథకం.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం దరఖాస్తు ఇలా..

‘‘సూర్య ఘర్‌ పథకానికి దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం, బిహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లలో 5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి’’ అని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘ఈ పథకం విద్యుత్‌ ఉత్పత్తితోపాటు కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుముఖం పట్టేందుకు దోహదపడుతుంది. ఇటువంటి పర్యావరణహిత చర్యలు.. భూగ్రహంపై జీవన పరిస్థితులు మరింత మెరుగయ్యేందుకు తోడ్పడతాయి’’ అని తెలిపారు. ఇంతవరకు నమోదు చేసుకోనివారూ ముందుకురావాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని