Vacant Jobs: కేంద్ర విద్యాసంస్థల్లో 11వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీ

దేశంలోని ప్రతిష్ఠాత్మక కేంద్ర విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల వివరాలను కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ ఉద్యోగాలు 11వేలకు పైనే. 

Published : 13 Dec 2022 01:24 IST

దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(Central Universities), ఐఐటీ(IITs)లు, ఐఐఎం(IIMs)లలో 11వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభ(Lok Sabha)లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(Dharmendra Pradhan) ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ డేటాను ఇచ్చారు. 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా.. వీటిలో 6,480 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా ఐఐటీలకు 11,170 పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 4,502 పోస్టులు; ఐఐఎంలలో 1566 పోస్టులు మంజూరు కాగా.. 493 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ఆయన తన సమాధానంలో వివరించారు. ఆయా విద్యాసంస్థల్లో ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం ఏర్పాటైన ఈ సంస్థల్లో నియామక ప్రక్రియ యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ఉద్యోగ ఖాళీలను మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించినట్టు తెలిపారు. దేశంలో 23 ఐఐటీలు, 20 ఐఐఎంలు ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని