
Pegasus: దేశం, వ్యవస్థ కంటే మోదీ ఎక్కువ కాదు.. సుప్రీం తీర్పుపై రాహుల్
దిల్లీ: పెగాసస్ స్పైవేర్ (Pegasus Spyware)తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై విచారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వాగతించారు. పెగాసస్‌పై కమిటీ ఏర్పాటుతో గొప్ప అడుగు పడిందని, దీంతో నిజానిజాలు బయటకు వస్తాయన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. దేశం, వ్యవస్థల కంటే ప్రధాని ఎక్కువ కాదన్నారు.
‘‘పెగాసస్‌తో దేశ పౌరులపై నిఘా పెట్టి.. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. దీనిపై పార్లమెంట్‌లో మేం ప్రశ్నిస్తే ప్రభుత్వం (Central Govt.) నుంచి ఎలాంటి స్పందన రాలేదు సరికదా.. మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు సుప్రీం ఉత్తర్వులు.. మా వాదనను సమర్థించాయి. పెగాసస్‌పై కమిటీ ఏర్పాటుతో గొప్ప ముందడుగు పడింది. దీంతో నిజాలు బయటకు వస్తాయని విశ్వసిస్తున్నాం. ఈ అంశాన్ని మరోసారి పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. ప్రధాని మూడు ప్రశ్నలు సంధిస్తున్నాం.. పెగాసస్‌ను ఉపయోగించేందుకు ఎవరు అధికారమిచ్చారు? ఈ స్పైవేర్‌ను ఎవరు ప్రయోగించారు? మన దేశ పౌరుల సమాచారం ఏ దేశం వద్దకైనా చేరిందా?’’ అని రాహుల్ మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రులు, మాజీ ప్రధాని, భాజపా మంత్రులకు వ్యతిరేకంగా పెగాసస్‌ను ఉపయోగించారని రాహుల్ ఆరోపించారు. ‘‘పెగాసస్‌తో వీరి సమాచారం ప్రధాని మోదీ, హోంమంత్రికి చేరిందా? ఒకవేళ ఎన్నికల కమిషన్, ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని ప్రధానికి అందిస్తే.. అది పూర్తిగా నేరపూరిత చర్యే. దానిపై చర్యలు తీసుకోవాలి. దేశం, వ్యవస్థ కంటే ప్రధాని ఏం ఎక్కువ కాదు’’ అని రాహుల్ అన్నారు.
పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తితో స్వత్రంత కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించింది. సాంకేతికత ఎంత ముఖ్యమో.. దేశ పౌరుల గోప్యత హక్కును కాపాడటం కూడా అంతే ముఖ్యమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.