Modi: సుప్రీంకోర్టుపై మోదీ ప్రశంసలు.. స్పందించిన సీజేఐ

Modi: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ అభినందన పూర్వకంగా నమస్కారం చేశారు.

Published : 15 Aug 2023 13:37 IST

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చారిత్రక ఎర్రకోట (Red Fort) నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi).. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)పై ప్రశంసలు కురిపించారు. తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. ఈ వేడుకలకు అతిథిగా హాజరైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ (CJI Justice DY Chandrachud).. మోదీ ప్రశంసలకు స్పందించారు. అభినందన పూర్వకంగా ప్రధానికి నమస్కారం చేశారు.

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయాన్ని ప్రస్తావించారు. ‘‘ప్రాంతీయ భాషల (regional languages) ప్రాముఖ్యత పెరుగుతోంది. మాతృభాషలో బోధనకు మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. సుప్రీంకోర్టు కూడా తమ తీర్పు ప్రతులను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని మోదీ సర్వోన్నత న్యాయస్థానంపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని వ్యాఖ్యలకు అక్కడే ఉన్న సీజేఐ స్పందిస్తూ.. అభినందన పూర్వకంగా నమస్కారం చేశారు.

త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: ఎర్రకోట నుంచి మోదీ ప్రకటన

సుప్రీంకోర్టులో తీర్పు ప్రతులు ఇక ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంటాయని ఈ ఏడాది ఆరంభంలో సీజేఐ జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కృత్రిమ మేధ సాయంతో ఇంగ్లిష్‌లో ఉన్న తీర్పు కాపీలను ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు. అలా ఇప్పటివరకు దాదాపు 9500 కాపీలను హందీ సహా పలు భాషల్లోకి అనువదించారు. సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇచ్చిన దాదాపు 35వేల తీర్పు కాపీలను ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో సీజేఐ వెల్లడించారు. ప్రస్తుతం హిందీతో పాటు ఒడియా, గుజరాతీ, హిందీ, తెలుగు, అస్సామీ, పంజాబీ, నేపాలీ తదితర భాషల్లోకి అనువదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని