Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గింది. వరుసగా రెండో రోజూ 60వేల కేసులే నమోదయ్యాయి. మరణాలు కూడా 2500లకు దిగొచ్చాయి. రికవరీల పెరుగుదల కొనసాగుతుండటంతో క్రియాశీల కేసుల గ్రాఫ్‌ తగ్గుతోంది. థర్డ్‌ వేవ్‌ ముప్పును .....

Updated : 16 Jun 2021 20:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గింది. వరుసగా రెండో రోజూ 60వేల కేసులే నమోదయ్యాయి. మరణాలు కూడా 2500లకు దిగొచ్చాయి. రికవరీల పెరుగుదల కొనసాగుతుండటంతో క్రియాశీల కేసుల గ్రాఫ్‌ తగ్గుతోంది. థర్డ్‌ వేవ్‌ ముప్పును ఎదుర్కొనేందుకు దిల్లీ సన్నద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కొద్దిమందే కొవిడ్‌ బారిన పడినట్టు ఓ అధ్యయనంలో తేలింది. కరోనా కష్ట కాలంలో కాస్త ఊరటనిచ్చే వార్తలు మీ కోసం..

* దేశంలో కరోనా సెంకడ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న 19లక్షల మందికి పైగా పరీక్షలు చేయగా.. 62వేల కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 28 లక్షల టీకా డోసులు పంపిణీ చేయడంతో ఆ సంఖ్య 26.1 కోట్ల మార్కును దాటింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.22%కి దిగి రాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.17%గా ఉంది. యాక్టివ్‌ కేసులు 8.65లక్షలకు తగ్గాయి. వరుసగా 34వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీలే అధికంగా కొనసాగుతున్నాయి.

మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కష్ట కాలంలో వైద్యులకు సహాయపడేందుకు వీలుగా 5000 మంది యువతకు హెల్త్‌ అసిస్టెంట్లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా రెండు దశల్లోనూ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బంది కొరత కనబడిందని, అందువల్ల వైద్యులు/ నర్సులకు సహాయపడేందుకు 5వేల మంది సహాయకులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. 12వ తరగతి పాసై 18 ఏళ్లు నిండినవారు ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జూన్‌ 28నుంచి రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. 

కరోనా రెండో దశ ఉద్ధృతి ఉన్నప్పటికీ ఈ ఏడాది మే నెలలో ఉద్యోగ నియమాకాల్లో వృద్ధికనిపించినట్టు మాన్‌స్టర్‌.కామ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సూచీ వెల్లడించింది. ఏప్రిల్‌తో పోలిస్తే 1శాతం మేర ఉద్యోగాలు అధికంగా వచ్చాయని తెలిపింది. రిటైల్‌, గృహోపకరణాలు, టెలికాం రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు పేర్కొంది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ సారి మేలో నియామకాల్లో 4శాతం వృద్ధి కనిపించిందని తెలిపింది.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1.16లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 1489 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్థారణ అయింది. ఈ రోజు 11 మంది మృతిచెందగా.. 1436మంది కోలుకున్నారు. ప్రస్తుతం 19,975 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 96.13శాతానికి పెరిగింది.

పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌, కల్యాణి ప్రాంతాల్లో పీఎం కేర్స్‌ నిధులతో రెండు కొవిడ్‌ ఆస్పత్రులను కేంద్రం నిర్మించనుంది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో 250 పడకలతో రెండు ఆస్పత్రుల నిర్మాణానికి రూ.41.62కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు పీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికోసం కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలు అందించనున్నాయని పేర్కొంది. 

తమిళనాడులోని చెన్నైలో బాలింతల కోసం ప్రత్యేక వ్యాక్సిషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. పాలిచ్చే తల్లులకు చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. మొదట్లో బాలింతలకు టీకా వేసేందుకు తాము వెనుకాడినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత టీకాలు వేస్తున్నట్టు గైనకాలజీ విభాగం డైరెక్టర్‌ తెలిపారు. 

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధి పెంపుపై గత కొన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు కేంద్రం వివరణ ఇచ్చింది. శాస్త్రీయపరమైన డేటాను విశ్లేషించాకే టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచామని, ఇది పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ ట్విటర్‌లో తెలిపారు. ఇలాంటి కీలకాంశాలపై రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

 దేశవ్యాప్తంగా అపోలో ఆస్పత్రుల్లో పనిచేసే 31వేల మందికి పైగా వైద్య సిబ్బందికి టీకా వేయగా.. వారిలో 5శాతం కన్నా తక్కువ మందికే కొవిడ్‌ సోకినట్టు ఓ అధ్యయనంలో తేలింది. కొద్ది మంది మాత్రమే ఆస్పత్రిపాలయ్యారని, మరణాలేమీ సంభవించలేదని వెల్లడైంది. జనవరి 16 నుంచి మే 31వరకు మధ్య దేశవ్యాప్తంగా 24 నగరాల్లోని 43 అపోలో ఆస్పత్రుల్లో 31,621మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. వీరిలో 25,907 మంది (81.9శాతం)కి రెండు డోసులూ పూర్తి కాగా.. 5,714మందికి తొలి డోసు (18.1శాతం) మాత్రమే అందింది. టీకా వేయించుకున్నాక 1355 మంది మాత్రమే (4.28శాతం) కరోనా బారిన పడినట్టు అధ్యయనంలో తేలింది. 90మంది (0.28శాతం) ఆస్పత్రిలో చేరగా.. ముగ్గురు మాత్రమే ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొంది. మరణాలు ఏమీ నమోదు కాలేదని అపోలో ఆస్పత్రుల గ్రూపు మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనుపమ్‌ సిబల్‌ వెల్లడించినట్టు అధ్యయనం పేర్కొంది.

దిల్లీలో వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల వ్యవధిలో 77,891శాంపిల్స్‌ పరీక్షించగా.. 212 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. కొత్తగా 25మంది మరణించగా.. 516మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 0.27కి తగ్గింది. దిల్లీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 18 ఏళ్ల పైబడిన వారి కోసం 2,35,500 డోసులు టీకాను కేంద్రం అందజేసింది.

 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.1.5 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ను మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ డయాగ్నొస్టిక్‌ కేంద్రంలో కొవిడ్‌తో పాటు 57రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని