ట్రాక్టర్‌ నడుపుతూ సభా వేదికకు రాహుల్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ నేడు రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. అజ్మేర్‌లోని రూపన్‌గఢ్‌లో అన్నదాతలు చేపట్టిన మహాపంచాయతీలో పాల్గొన్న ఆయన.. రైతులను ఉద్దేశించి ప్రసంగించారు

Published : 14 Feb 2021 01:36 IST

జైపూర్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ నేడు రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. అజ్మేర్‌లోని రూపన్‌గఢ్‌లో అన్నదాతలు చేపట్టిన మహాపంచాయతీలో పాల్గొన్న ఆయన.. రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ బహిరంగ సభకు రాహుల్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ రావడం విశేషం. 

రాజస్థానీ సంప్రదాయంలో తలపాగా ధరించిన రాహుల్‌.. ట్రాక్టర్‌ నడుపుతూ సభా వేదిక వద్దకు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ ట్రాక్టర్‌పై చెరోవైపు కూర్చున్నారు. అనంతరం రెండు ట్రాక్టర్‌ ట్రాలీలతో ఏర్పాటు చేసిన వేదికపై నిల్చుని రాహుల్‌ సాగు చట్టాలపై ప్రసంగించారు. రాహుల్‌ ట్రాక్టర్‌ నడుపుతున్న ఫొటోలను కాంగ్రెస్‌ పార్టీ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.  

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయమనే వ్యాపారాన్ని ప్రధాని తన స్నేహితులకు అప్పగించాలనుకుంటున్నారని అందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ‘‘ దేశంలోని 40శాతం మందికి వ్యవసాయంతో సంబంధం ఉంది. వీరిలో రైతులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కూలీలు ఉన్నారు. ఇలా ఉన్న వ్యవసాయ వ్యాపారాన్నంతా మోదీ తన స్నేహితులకు ఇవ్వాలని చూస్తున్నారు. సాగు చట్టాల ఉద్దేశం ఇదే’’ అని రాహుల్‌ ఆరోపించారు. సాగు చట్టాలతో రైతులకు అవకాశాలు ఇచ్చామని ప్రధాని అంటున్నారని, అయితే ఆయన చెబుతున్న అవకాశాలు.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలేనని దుయ్యబట్టారు. 

ఇవీ చదవండి..

సామాన్యులే మా మిత్రులు

చైనాను అడ్డుకోలేరు.. రైతుల్ని బెదిరిస్తారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని