Railway recruitment:రైలును తగులబెట్టిన అభ్యర్థులు.. ఇంతకీ వివాదం దేనికి?

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్​ఆర్​బీ) పరీక్షల్లో అక్రమాలపై బిహార్​లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. గయాలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన......

Published : 27 Jan 2022 01:26 IST

పట్నా: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్​ఆర్​బీ) పరీక్షల్లో అక్రమాలపై బిహార్​లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. గయలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆగిఉన్న ఓ రైలును రాళ్లు, కర్రలతో ధ్వంసం చేసి ఆపై నిప్పంటించారు. ఇదిలా ఉంటే పరీక్షల్లో అవకతవకలపై అభ్యర్థుల ఆందోళనల దృష్ట్యా.. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ)తో పాటు లెవల్-1 పరీక్షలను నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల పరిధిలోని పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు, ఫెయిల్ అయినవారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

తాజా ఆందోళనలపై గయ ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్ మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. రైలు తగలబెట్టిన కొందరిని తాము అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని అభ్యర్థులకు సూచించారు. ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని వెల్లడించారు.

ఆర్‌ఆర్‌బీ 2019లో సీబీటీ-1 పరీక్షను నిర్వహించిందని.. ఆ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అప్పటినుంచి సరైన రీతిలో ఉత్తీర్ణత జాబితాను ప్రకటించలేదని.. ఈలోపే సీబీటీ-2 పరీక్ష నిర్వహణకు సిద్ధమైందని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ పరీక్షను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని