వర్గీకరణ ఉండొచ్చు: సుప్రీంకోర్టు

పంజాబ్‌కు చెందిన కేసులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ..

Updated : 27 Aug 2020 14:02 IST

దిల్లీ: పంజాబ్‌కు చెందిన కేసులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. షెడ్యూల్‌ కులాల్లో ఉప కులాలు ఉండొచ్చని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ కులాల ఉప వర్గీకరణ కోసం పంజాబ్‌ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీంతో పంజాబ్‌ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్దిస్తూ  తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 2004 నాటి తీర్పును సరిగా నిర్ణయం తీసుకోకుండానే ఇచ్చారని వ్యాఖ్యానించింది.

 అయితే, గతంలో ఇదే రిజర్వేషన్లకు సంబంధించి 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో నాటి రాజ్యాంగ ధర్మాసనం షెడ్యూల్‌ కులాల్లో మళ్లీ ఉప కులాలు అవసరం లేదని తీర్పు వెలువరించింది. గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో నేటి రాజ్యాంగ ధర్మాసనం విభేదించింది. రెండు ధర్మాసనాల తీర్పు విభేదంతో ఈ కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. విస్తృత ధర్మాసనం ఏర్పాటు కోసం ఈ అంశాన్ని జస్టిస్‌ బోబ్డేకు ధర్మాసనం నివేదించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది సభ్యులున్న ధర్మాసనం రిజర్వేషన్ల కేసును సమీక్షించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని