Corona: గాలి ద్వారా వ్యాప్తి..ప్రోటోకాల్‌లో చేర్చిన కేంద్రం!

గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశాన్ని కొవిడ్‌-19 క్లినికల్‌ మేనేజిమెంట్‌ ప్రోటోకాల్‌లో చేర్చింది.

Published : 26 May 2021 18:26 IST

స్టెరాయిడ్ల వాడకంపై జాగ్రతలు చెప్పిన ఆరోగ్యశాఖ

దిల్లీ: గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశాన్ని కొవిడ్‌-19 క్లినికల్‌ మేనేజ్మెం‌ట్‌ ప్రోటోకాల్‌లో చేర్చింది. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కొవిడ్‌ నియమాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.

‘కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వైరస్‌ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య 1 మీటరు కంటే తక్కువ దూరం ఉన్న సమయంలో నోటి తుంపర్ల నుంచి ఎదుటివారికి కళ్లు, నోరు, ముక్కు ద్వారా సోకే ప్రమాదం ఉంటుంది. కానీ వెంటిలేషన్‌ తక్కువగా ఉన్న ప్రాంతాలు/రద్దీగా ఉండే ఇంటిలోపలి ప్రాంతాల్లో వైరస్‌ ఎక్కువ సమయం ఒకేచోట స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో వైరస్ మీటరు కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆస్కారం ఉంటుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనను కేంద్ర ఆరోగ్యశాఖ సవరించిన ప్రోటోకాల్‌లో వెల్లడించింది. గతేడాది జూన్‌లో విడుదల చేసిన ప్రోటోకాల్‌లో.. వైరస్‌ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం, తుమ్మడం, దగ్గడం వల్ల వచ్చే శ్వాసబిందువులతో వైరస్‌ వ్యాపిస్తుందని మాత్రమే వెల్లడించింది. తాజాగా గాలి ద్వారాను వైరస్‌ వ్యాపిస్తుందనే అంశాన్ని చేర్చింది.

ఇక గాలిలో వైరస్‌ వ్యాప్తిపై ఈ మధ్యే కేంద్ర ఆరోగ్యశాఖ శాస్త్రీయ సలహాదారు కూడా పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ‘తుంపర్ల ద్వారా గాలిలో వైరస్‌ దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణించగలదు. ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లో ఈ ఏరోసోల్స్‌ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇళ్లు, పని ప్రదేశాల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి’ అని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

స్టెరాయిడ్లపై జాగ్రత్త..

కరోనా చికిత్స, ఔషధాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తాజా కొవిడ్‌ నియమాల్లో చేర్చింది. ఐవర్‌మెక్టిన్‌ మాత్రలు, స్టెరాయిడ్ల వాడకంపై స్పష్టతనిచ్చింది. స్వల్ప లక్షణాలున్న బాధితులకు ఐవర్‌మెక్టిన్‌ రోజుకు ఒకటిచొప్పున మూడు నుంచి ఐదు రోజుల వరకు తీసుకోవచ్చని సూచించింది. స్టెరాయిడ్ల వాడకంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా స్వల్ప లక్షణాలున్న వారికి ఇవి అవసరం లేదని పేర్కొంది. లక్షణాలు ఏడు రోజులకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యుల సలహా మేరకు స్వల్ప డోసులో వాడవచ్చని పేర్కొంది. రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ ఔషధాలను అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని