RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్‌ మద్దతు

RSS on Hindenburg report: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదికను ఉద్దేశపూర్వకదాడిగా ఆరెస్సెస్‌ అభివర్ణించింది. వాస్తవానికి ఏడేళ్ల క్రితమే అదానీపై దాడి మొదలైందని ఆరెస్సెస్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌ పేర్కొంది.

Published : 05 Feb 2023 01:22 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani group) వ్యాపారాలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక (Hindenburg report) కలకలం కొనసాగుతోంది. స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్లన్నీ దాదాపు పతనమయ్యాయి. మార్కెట్‌ ఒడుదొడుకుల నేపథ్యంలో ఎఫ్‌పీఓను సైతం అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఉపసంహరించుకుంది. మరోవైపు ఈ వ్యవహారం పార్లమెంట్‌నూ తాకింది. హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) ఈ వ్యవహారంపై స్పందించింది. అదానీ గ్రూప్‌ మద్దతుగా నిలిచింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదికను ఉద్దేశపూర్వక దాడిగా అభివర్ణించింది. ఈ మేరకు సంఘ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఆర్గనైజర్‌లో ఓ కథనం రాసింది.

షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చి ఇచ్చిన నివేదికను అనుసరించి ఒక వర్గానికి చెందిన భారతీయులు అదానీకి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారం ప్రారంభించారని ఆర్గనైజర్‌ ఆరోపించింది. అదానీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారంలో కొందరు వామపక్ష భావజాలంతో సంబంధం ఉన్న కొన్ని వెబ్‌సైట్లు, కొందరు వ్యక్తులు ఉన్నారని ఆరోపించింది. వాస్తవానికి హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ విషయంలో జరుగుతున్న దాడి వాస్తవానికి జనవరి 25న ప్రారంభం కాలేదని.. దీనికి 2016-17లో ఆస్ట్రేలియాలోనే బీజాలు పడ్డాయని ఆరోపించింది.

ఆస్ట్రేలియాకు చెందిన బాబ్‌ బ్రౌన్‌ ఫౌండేషన్‌ అనే పర్యావరణ అనుకూల ఎన్జీఓకు చెందిన ఓ వెబ్‌సైట్‌ అదానీని దెబ్బతీసేందుకు ఉద్దేపూర్వకంగా కథనాలు ప్రచురిస్తోందని ఆర్గనైజర్‌ ఆరోపించింది. ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గనుల ప్రాజెక్టుపై వ్యతిరేకతతో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌.. అదానీకి సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్‌ గురించీ ప్రచురిస్తుందని పేర్కొంది. అదానీ సంస్థ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడమే దీని లక్ష్యమని ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని