NEET: మెడికల్‌ పరీక్షల్లో అక్రమాలు.. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ గుర్తొస్తోంది : హైకోర్టు

మెడికల్‌ పరీక్షల్లో (Medical Exams) కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఎంతో మంది అభ్యర్థులు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఇవి ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ (Munnabhai MBBS) సినిమాను గుర్తు చేస్తున్నాయని (Bombay High Court) ఔరంగాబాద్‌ బెంచ్‌ పేర్కొంది.

Updated : 18 Nov 2023 05:12 IST

ముంబయి: మెడికల్‌ పరీక్షల్లో (Medical Exams) అభ్యర్థులు అక్రమాలకు పాల్పడటంపై బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఎంతో మంది అభ్యర్థులు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఇవి ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ (Munnabhai MBBS) సినిమాను గుర్తు చేస్తున్నాయని (Bombay High Court) ఔరంగాబాద్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. సరైన ధ్రువపత్రం లేని కారణంగా నీట్‌ (NEET) పరీక్షకు అనుమతించకపోవడంపై ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంలో ఈవిధంగా వ్యాఖ్యానించింది.

మెడికల్‌ కౌన్సిల్‌ జారీ చేసిన పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ లేని కారణంగా శ్యాంసుందర్‌ పాటిల్‌ (49) అనే వైద్యుడిని ఇటీవల జరిగిన నీట్‌ పరీక్షకు అనుమతించలేదు. దీంతో తన కోసం నీట్‌ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహించేలా నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌కు ఆదేశాలివ్వాలంటూ శ్యాంసుందర్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిని ఔరంగాబాద్‌ బెంచ్‌లోని జస్టిస్‌ రవీంద్ర ఘుగే, జస్టిస్‌ వై గోపీచంద్‌ ఖోబ్రగడేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. అధికారులు అడిగిన ధ్రువీకరణ పత్రం తన ఫోన్‌లోనే ఉందని శ్యాంసుందర్‌ వాదించాడు. పరీక్ష హాల్‌లోకి మొబైల్‌ అనుమతి లేని కారణంగా దాన్ని చూపించడం కుదరలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అయితే, ఇందులో అధికారులను తప్పుపట్టలేమని స్పష్టం చేసిన బెంచ్‌.. అభ్యర్థి విన్నపాన్ని తిరస్కరించింది.

Reservation: ప్రైవేటు ఉద్యోగాల్లో 75%కోటా రాజ్యాంగ విరుద్ధం: హైకోర్టు

‘వైద్య పరీక్షల్లో అక్రమాలు చూస్తుంటే ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమా గుర్తోస్తోంది. ఈ తరహా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. నీట్‌-యూజీ, పీజీ పరీక్షలపై హ్యాకింగ్‌ జరగడం, పరీక్ష హాల్‌లోకి ఎయిర్‌-పాడ్‌ లేదా ఎలక్ట్రానిక్‌ ఇయర్‌బడ్స్‌ను తీసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. సాంకేతిక పురోగతి, అభివృద్ధి ఫలితంగా అడ్మిట్‌ కార్డులు, ఐడీ కార్డులు తయారు చేయడం, వెబ్‌సైట్లను హ్యాకింగ్‌ చేయడం వంటి ఘటనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ అభ్యర్థులు సరైన ధ్రువపత్రాన్ని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లలేదు. అందుకే ఈ కేసులో అభ్యర్థికి ఉపశమనం కలిగించలేం’ అని ఔరంగాబాద్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని