Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు

బాల్య వివాహం(Child Marriage) చేసుకున్న వారిని అరెస్టు చేయడంపై అస్సాం (Assam)లో మహిళలు నిరసనకు దిగారు. తమ భర్తలను విడిచిపెట్టాలని కోరుతూ.. పోలీస్‌ స్టేషన్ల ముందు ఆందోళనకు దిగారు. 

Published : 05 Feb 2023 22:58 IST

గువాహతి: చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు (Child Marriages) చేసుకున్న వారిపై అస్సాం (Assam) ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఇందుకు పాల్పడిన వారిపై ప్రభుత్వం అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,278 మందిని అరెస్టు చేసినట్లు అస్సాం పోలీసు (Assam Police) శాఖ వెల్లడించింది.  రాష్ట్రంలో  బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నమోదైన 4,074 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ అరెస్టులు చేసినట్టు తెలిపింది. వీటిలో అత్యధికంగా దుబ్రి జిల్లాలో 374 మందిని అరెస్టు చేయగా, హోజాయ్‌ జిల్లాలో 255 మంది, మోరిగోన్ జిల్లాలో 224 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. మరోవైపు అరెస్టు చేసిన వారి కోసం పలువురు మహిళలు, వారి కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్ల ఎదుట నిరసన చేపట్టారు. ‘‘ఆధార్‌లో మా కోడలి వయసు తప్పుగా ఉండంటంతో నా కొడుకును అరెస్టు చేశారు. ఇప్పుడు శిక్ష పడి జైలుకు వెళితే నా కోడలు, ఏడాది బిడ్డతో ఎక్కడి పోవాలి? వారిని ఎవరు పోషిస్తారు?’’ అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

అస్సాంలో బాల్య వివాహాలు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద, 14 ఏళ్ల లోపు వారిని పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని కొద్ది రోజుల క్రితం అస్సాం కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు జన్యుపరమైన లోపాలతో పుడుతున్నారని రాష్ట్రం ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుమారు 2,278 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుల ప్రక్రియ 2026 ఎన్నికల వరకు కొనసాగుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. బాల్యవివాహాలు చేసుకున్న వారితోపాటు, వివాహం జరిపించిన మత పెద్దలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికల తల్లిదండ్రులకు మాత్రం నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని