Karnataka: కర్ణాటకలో ఇక మోరల్‌ పోలీసింగ్‌పై పటిష్ఠ నిఘా!

కర్ణాటక (Karnatak)లో మోరల్‌ పోలీసింగ్‌ (Moral Policing)ను నియత్రించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిందని కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వర తెలిపారు. 

Published : 06 Jun 2023 17:25 IST

బెంగళూరు: రాష్ట్రంలో మతపరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక (Karnataka) హోంమంత్రి జీ. పరమేశ్వర తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన నగరాలతోపాటు, మంగళూరు (Mangaluru) ప్రాంతంలో మోరల్‌ పోలీసింగ్‌ (Moral Policing) జరుగుతోందని, దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుందని ప్రకటించారు. 

‘‘ దక్షిణ కన్నడ ప్రాంతంతోపాటు మంగళూరు వంటి చోట్ల మోరల్‌ పోలీసింగ్ ఎక్కువగా జరుగుతోంది. ప్రజలు ఈ మోరల్ పోలీసింగ్‌తో విసిగిపోయారు. దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మోరల్‌ పోలీసింగ్ వ్యవస్థను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నియంత్రిస్తాం’’ అని మంత్రి పరమేశ్వర వెల్లడించారు. మోరల్‌ పోలిసింగ్‌ను నియంత్రించేందుకు పోలీస్‌ వ్యవస్థలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మోరల్‌ పోలిసింగ్‌తోపాటు మతపరమైన కేసులకు సంబంధించిన విచారణను కూడా ఈ బృందాలే చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని నెలకొల్పడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని