Indian Fishermen: 15 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక

చేపల వేటకు వెళ్లిన 15 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నౌకాదళ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు.

Published : 15 Mar 2024 15:28 IST

కొలంబో: తమ దేశ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ భారత్‌కు చెందిన 15 మంది జాలర్లను శ్రీలంక నౌకాదళం శుక్రవారం అరెస్టు చేసింది. ఉత్తర జాఫ్నా ద్వీప సమీపంలోని కరైనగర్ తీరంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ కోసం వారిని ఫిషింగ్ డైరెక్టరేట్‌కు అప్పగించినట్లు తెలిపింది. కొద్దిరోజుల క్రితం భారత జాలర్లు తమ పరిధిని దాటి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించి చేపల వేట సాగిస్తున్నారని ఆ దేశ జాలర్లు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.  

ఇప్పటివరకు శ్రీలంక నౌకాదళం 16 బోట్లను జప్తు చేయడంతోపాటు 225 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇది ఆరో ఘటన. జనవరిలో రెండు సార్లు, ఫిబ్రవరిలో మూడుసార్లు భారత జాలర్ల అరెస్టులు చోటుచేసుకున్నాయి. భారత్‌ - శ్రీలంకల మధ్య చేపలవేట వివాదం ఎంతోకాలంగా నెలకొంది. తమిళనాడు, శ్రీలంకను వేరు చేసే పాక్‌ జలసంధిలో మత్స్యసంపద సమృద్ధిగా ఉంది. ఇక్కడ చేపల వేటకు వెళ్లిన భారత జాలర్లను గతంలో పలుమార్లు శ్రీలంక అధికారులు అరెస్టు చేయడమేగాక, వారిపై కాల్పులు జరిపిన సందర్భాలున్నాయి. 2023లో శ్రీలంక నేవీ సిబ్బంది 240 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని