Supreme Court: స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి!

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీం కోర్టు సోమవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ఈ కేసు రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది.

Updated : 13 Mar 2023 18:22 IST

దిల్లీ: స్వలింగ వివాహాల(Same Sex Marriage)కు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీం కోర్టు(Supreme Court).. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై సీజేఐ(CJI) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌(Justice DY Chandrachud), జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ఈ కేసు ఒకవైపు రాజ్యాంగ హక్కులు(Constitution Rights), మరోవైపు ప్రత్యేక వివాహ చట్టం(SMA), ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటూ.. దీనిపై విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే సంబంధిత పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి(Constitution Bench) సిఫార్సు చేస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేసింది.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఇలాంటి వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని, వాటికి చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఇప్పటికే అఫిడవిట్‌ సమర్పించింది. సోమవారం కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు.

అంతకుముందు ఈ వ్యవహారంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం ఎవరి వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం లేదు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం నియంత్రించదు. కానీ, వివాహం విషయానికొస్తే.. అది విధానాలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని