Updated : 06/10/2021 12:48 IST

Taiwan: తైవాన్‌ ఆక్రమణ దిశగా చైనా అడుగులు..?

 దక్షిణ చైనా సముద్రంలో వేగంగా మారుతున్న పరిణామాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్‌ గగనతలంలోకి చైనా విమానాలను పంపించి కవ్వించింది. ఇటీవల కాలంలో ఒక దేశ గగనతలంలోకి మరో దేశం విమానాలు ఈ స్థాయిలో వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితి పెరిగింది. తైవాన్‌ ప్రభుత్వం ఈ ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2025లోపు చైనా తమ దేశంపై దండయాత్ర చేయడం ఖాయమని రక్షణ మంత్రి ఛై-కూఛెంగ్‌ ఏకంగా పార్లమెంట్‌లోనే పేర్కొన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

ఏమి జరుగుతోంది..?

ఇటీవల కాలంలో చైనా యుద్ధవిమానాలు తరచూ తైవాన్‌ గగనతలంలో ప్రవేశిస్తున్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. సోమవారం ఏకంగా 52 యుద్ధ విమానాలను పంపించింది. తైవాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ ఒక్కసారి ఎన్ని విమానాలను గుర్తించగలదో అంచనా వేయడానికి డ్రాగన్‌ తరచూ ఇలా చేస్తోంది. అందుకే క్రమంగా విమానాల సంఖ్యను కూడా పెంచుతోంది.    

భారత్‌తో సెమీకండక్టర్ల తయారీ ఒప్పంద చర్చల సమయంలో..

భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పడంపై తైవాన్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే భారత్‌లో టీఎస్‌ఎంసీ(తైవాన్‌ సెమీకండక్టర్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌) రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది భారత్‌లోని పరిశ్రమలను మరోమెట్టు పైకి ఎక్కించే ఒప్పందం. చైనాకు ఈ ఒప్పందం ఏమాత్రం ఇష్టంలేదు. ఇటీవల  చైనా చొరబాట్లు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. 

తేలని బైడెన్‌ పాలసీ..

ట్రంప్‌ హయాంలో తైవాన్‌ను రక్షించేందుకు అమెరికా దూకుడుగానే వ్యవహరించింది. తైవాన్‌ జోలికి వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక దశలో హెచ్చరించింది. కానీ, బైడెన్‌ వచ్చాక అమెరికా దూకుడు తగ్గింది. తాజాగా కొందరు విలేకర్లు  చైనా యుద్ధవిమానాల చొరబాట్లపై బైడెన్‌ను ప్రశ్నించగా..‘‘నేను షీ జిన్‌పింగ్‌తో మాట్లాడాను. మేము తైవాన్‌ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు అంగీకారానికి వచ్చాము. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా ముందుకు వెళుతుందని నేను అనుకోవట్లేదు’’ అని పేర్కొన్నారు.  సెప్టెంబర్‌ 9వ తేదీన ఆయన షీ జిన్‌పింగ్‌తో మాట్లాడిన విషయం తెలిసిందే. చెప్పిన మాటపై నిలబడిన చరిత్ర డ్రాగన్‌కు లేదనే విషయం బైడెన్‌కు తెలియనిది కాదు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతుండగానే చైనా దాడి చేసిందని చరిత్ర చూస్తే అర్థమవుతుంది. 

అమెరికా రక్షించగలదా..?

వాస్తవానికి ‘ఫస్ట్‌ ఐలాండ్‌ ఛైన్‌’గా వ్యవహరించే ప్రదేశంలో తైవాన్‌ ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న జపాన్‌, ఫిలిప్పీన్స్‌, వియాత్నాం దేశాలకు అమెరికాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. తైవాన్‌లోని సెమీకండక్టర్‌ పరిశ్రమపై ఈ దేశాలు భారీగా ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ అమెరికా దళాలు కూడా ఉంటున్నాయి. తైవాన్‌ ఆయుధాల్లో అత్యధికం అమెరికావే. గతేడాది తైవాన్‌ 62 బిలియన్‌ డాలర్ల ఆయుధాలను అమెరికా నుంచి కొనేందుకు సిద్ధమైంది. దీనికి అప్పట్లో ట్రంప్‌ పచ్చజెండా ఊపారు. తైవాన్‌కు ఆయుధాలు అమ్మడం అంటే... చైనాకు నిద్రను కరవు చేయడం వంటిదే. ఈ డీల్‌లో భాగంగా 66 అత్యాధునిక ఎఫ్‌-16 యుద్ధవిమానాలు తైవాన్‌కు అందనున్నాయి. ఇప్పటికే 2019లో 90 విమానాలను ఆర్డరు చేసింది. ఏడాది క్రితం మరో 66 విమానాలకు పచ్చజెండా ఊపింది.  తైవాన్‌ ఆక్రమణ జరిగితే అమెరికా టెక్నాలజీతో చేసిన ఆయుధాలు చైనా చేతిలో పడతాయి. ఈ విషయం అమెరికా నేతలకు తెలుసు. అంతేకాదు అమెరికాను వెనక్కి నెట్టి చైనా సూపర్‌ పవర్‌గా పూర్తి స్థాయి గుర్తింపు తెచ్చుకొంటుంది. ఈ నేపథ్యంలో చైనా దూకుడును అగ్రరాజ్యం కట్టడి చేస్తుందన్న ఆశ తైవాన్‌లో ఉంది.  క్రిమియా ఆక్రమణకు రష్యా ఆర్థికంగా భారీగా మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటికే పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఇటీవల ఆ దేశ జీడీపీ కూడా కుచించుకుపోతోంది. డ్రాగన్‌ తైవాన్‌పై దండెత్తితే ఇటువంటి పరిస్థితే చైనాకు ఎదురయ్యే అవకాశం ఉంది.  ఇప్పటికే అమెరికా ‘తైవాన్‌ ఇన్వేజన్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌’ను తీసుకొచ్చింది. 

చుట్టుపక్కల దేశాలతో ఉద్రిక్తతలు అందుకేనా..

గత కొన్నేళ్లుగా తైవాన్‌తోపాటు చుట్టుపక్కల దేశాలతో కూడా డ్రాగన్‌ గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. తైవాన్‌పై దాడి అంశాన్ని పక్కదోవ పట్టించడానికే ఇలా చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రపంచం దృష్టిని వేరే ప్రాంతాలకు మళ్లించి.. తైవాన్‌పై హఠాత్తుగా దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఇరాక్‌తో యుద్ధం సమయంలో అమెరికా ఇటువంటి వ్యూహాన్నే అమలు చేసింది. తొలుత కువైట్‌ను ఆక్రమించిన ఇరాక్‌ సేనలపై నేరుగా దాడి చేస్తుందనే భ్రమను కల్పించింది. ఇందుకోసం చిన్నాచితకా దాడులు కూడా చేసింది. కానీ, తర్వాత మరో వైపు నుంచి నేరుగా ఇరాక్‌లోకి అమెరికా సేనలు అడుగుపెట్టాయి.  కువైట్‌లోని ఇరాక్‌ సేనలకు సరఫరాలు నిలిచిపోయాయి. చైనా కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరించవచ్చు. 

చైనా సమీపంలోని ఓకినావా(జపాన్‌), గువామ్‌లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర అమెరికా మిత్ర దేశాలతో గొడవ పెట్టుకొంటే..  వారి దృష్టి మళ్లించి తైవాన్‌ను ఆక్రమించవచ్చు. తైవాన్‌ను ఆక్రమించేందుకు చేస్తున్న యత్నాలు అమెరికా జనరల్స్‌కు తెలియనిది కాదు. ఇటీవల అమెరికా జనరల్‌ మార్క్‌మిల్లీ కాంగ్రెస్‌ విచారణలో మాట్లాడుతూ ‘‘2027 నాటికి తైవాన్‌ను ఆక్రమించి ఆధీనంలో ఉంచుకొనే సామర్థ్యం కోసం చైనా ప్రయత్నిస్తోంది.. అయితే, సమీప భవిష్యత్తులో ఇలా చేయకపోవచ్చు. గతంలో 2035 నాటికి తైవాన్‌ ఆక్రమించాలన్న లక్ష్యాన్ని షీ జిన్‌పింగ్‌ 2027కు కుదించారు’’ అని వెల్లడించారు. తాజాగా తైవాన్‌ రక్షణ మంత్రి పార్లమెంట్‌లో ఇటువంటి అనుమానాన్నే వ్యక్తం చేయడం దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితిని తెలియజేస్తోంది. దీంతో 8.6 బిలియన్‌ డాలర్లు వెచ్చించి ఆయుధాలు సమీకరించే విషయాన్ని తైవాన్‌ పరిశీలిస్తోంది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని