Manoj Jarange: ‘మరాఠా కోటా’పై ఏం చేశారో డిసెంబర్‌ 17లోపే చెప్పండి.. లేదంటే!

మరాఠా వర్గానికి రిజర్వేషన్ల అంశంపై ఏం చేశారో ఆదివారం లోపు చెప్పాలని ఉద్యమ నేత మనోజ్‌ జారంగే డిమాండ్‌ చేశారు.

Published : 15 Dec 2023 21:58 IST

ఛత్రపతి శంభాజీనగర్‌: మరాఠా కోటా కోసం ప్రభుత్వం ఏం చేసిందో డిసెంబర్‌ 17లోగా మంత్రులు చెప్పాలని ఉద్యమ నేత మనోజ్‌ జారంగే డిమాండ్‌ చేశారు. లేదంటే మళ్లీ ఉద్యమానికి పిలుపునిస్తామని.. ఈసారి వెనక్కి తగ్గే ప్రశ్నే ఉండదన్నారు. ఈ అంశంపై మంత్రులు అతుల్‌ సావే, ధనుంజయ్‌ ముండే, ఉదయ్‌ సామంత్‌ తదితరులు మాట్లాడకపోతే తమ వర్గాన్ని మోసగించినట్లుగానే భావించాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న జారంగే తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించిన సమయంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన హమీ పత్రాలున్నాయని.. మంత్రులు ఇప్పుడు స్పందించకపోతే వాటిని బహిర్గతం చేస్తామన్నారు.  ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే మాత్రం మళ్లీ అంతర్వాలి సారథిలో గ్రామంలోనే సమావేశమై.. తదుపరి ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తామని నిన్న వ్యాఖ్యానించారు. 

పార్లమెంటులో అలజడి.. పోలీస్‌ కస్టడీకి ‘ప్రధాన సూత్రధారి’

మహారాష్ట్రలో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ అక్టోబర్‌లో జాల్నా జిల్లాలోని అంతర్వాలి సారథి గ్రామంలో మనోజ్‌ జారంగే  ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే, మరాఠా రిజర్వేషన్లు అమలు చేసి.. ఆ వర్గానికి న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఆ సమయంలోనే మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వానికి జారంగే డిసెంబర్‌ 24వరకు డెడ్‌లైన్‌ విధించారు. అందుకు ప్రభుత్వం సరేనని చెప్పడంతో నవంబర్‌ 2న తన దీక్షను విరమించి ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి కోలుకొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని