Asteroid: నేడు భూమికి చేరువగా గ్రహశకలం

గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఒక గ్రహశకలంపై ఖగోళశాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు.

Updated : 21 Aug 2021 08:43 IST

వాషింగ్టన్‌: గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఒక గ్రహశకలంపై ఖగోళశాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. శనివారం ఇది పుడమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ తెలిపింది. దీన్ని ప్రమాదకరమైన అంతరిక్ష శిలగా అభివర్ణించింది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల ఎలాంటి హాని ఉండబోదని పేర్కొంది. ఆ గ్రహశకలానికి ‘2016 ఏజే193’ అని పేరు పెట్టారు. దాని వెడల్పు 4,500 అడుగులు. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇది శనివారం భూమికి దగ్గరగా వచ్చి వెళుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో దానికి, భూమికి మధ్య ఉన్న దూరం.. పుడమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువని చెప్పారు. ఇది మళ్లీ 2063లో భూమికి దగ్గరగా వస్తుందన్నారు. 2016 జనవరిలో హవాయ్‌లోని పాన్‌-స్టార్స్‌ అబ్జర్వేటరీ సాయంతో ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. ఆ తర్వాత నాసా.. నియోవైస్‌ అనే వ్యోమనౌక సాయంతో దీన్ని నిశితంగా పరిశీలించింది. ఈ ఖగోళ వస్తువు చాలా చీకటిగా ఉందని, దీని నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందడంలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది 5.9 ఏళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని