IPS: పోలీసు వ్యవస్థపై ఉన్న వ్యతిరేక భావనను తొలగించండి..!

పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్‌లపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 31 Jul 2021 16:21 IST

ప్రొబెషనరీ ఐపీఎస్‌లకు ప్రధాని మోదీ పిలుపు

దిల్లీ: పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్‌లపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉన్నతాధికారులుగా మీరు చేసే ప్రతిపనిలో ‘దేశమే ముందు, ఎప్పటికీ ముందు (Nation First, Always First)’ అనే భావన ప్రతిబింబించాలని అన్నారు. హైదరాబాద్‌లోని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. వారికి పలు సూచనలు చేశారు.

అధికారులుగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో జాతి ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని మోదీ ప్రొబెషనరీ ఐపీఎస్‌లకు సూచించారు. ‘ఐపీఎస్‌ అధికారుల వృత్తిలోని రాబోయే 25సంవత్సరాలు.. భారత్‌ అభివృద్ధిలో కీలకమైన 25సంవత్సరాలుగా మారనున్నాయి. ముఖ్యంగా విధుల్లో భాగంగా దేశంలో ఎన్నో ప్రాంతాల్లో పనిచేసే అవకాశం ఉన్నందున వేర్వేరు పాత్రలు పోషిస్తారు. దీంతో ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీసు వ్యవస్థను నిర్మించాల్సిన అతిపెద్ద బాధ్యత మీ అందరిపై ఉంది’ అని ప్రొబెషనరీ ఐపీఎస్‌లకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో దేశమే ముందు, ఎప్పటికీ ముందు అనే భావన ప్రతి పనిలోనూ ప్రతిబింబించాలని చెప్పారు. అంతేకాకుండా ఐక్య భారత్‌, శ్రేష్ఠ భారత్‌ అనే నినాదాన్ని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలన్నారు.

పోలీసుల త్యాగాలు మరువలేనివి..

పోలీసు వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేక భావన ఉండడం దేశానికి అతిపెద్ద సవాల్‌ అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో పోలీసు సిబ్బంది చేసిన సహాయం ఈ భావనను కాస్త తగ్గించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా విధుల్లో కుటుంబాలకు దూరంగా ఉండడమే కాకుండా.. దేశ రక్షణలో ఎంతో మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు అర్పించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో పోలీసులపై ఉన్న వ్యతిరేక దృక్పథాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్‌లపై ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో సురాజ్య (Good Governance) స్థాపన కోసం ప్రొబెషనరీ ఐపీఎస్‌లు పనిచేయాలని ప్రధాని మోదీ హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని