Child Marriages: బాల్య వివాహాలు.. రోజుకు 60మంది బాలికలు బలి!

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలకు ప్రపంచ వ్యాప్తంగా నిత్యం 60మంది బాలికలు బలి అవుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Published : 11 Oct 2021 23:27 IST

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు. అయినప్పటికీ ఎన్నో ఏళ్లుగా బాల్య వివాహాల పరంపర కొనసాగుతూనే ఉంది. వీటి వల్ల కలిగే అనర్థాలకు ప్రపంచ వ్యాప్తంగా నిత్యం 60 మంది బాలికలు బలి అవుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా కేవలం దక్షిణాసియాలోనే ప్రతి రోజూ ఆరుగురు బాలికలు ప్రాణాలు విడుస్తున్నట్లు తేలింది. చిన్న వయసులోనే వివాహం కావడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో ఏటా దాదాపు 22వేల మంది బాలికలు మృత్యువాతపడుతున్నట్లు వెల్లడైంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా Global Girlhood Report 2021 పేరుతో ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

బాల్యవివాహాల సంఖ్య దక్షిణాసియాలోనూ ఎక్కువగా ఉన్నట్లు సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ వెల్లడించింది. వీటివల్ల ఏటా 2వేల మంది (ప్రతిరోజు ఆరుగురు) బాలికలు మరణిస్తున్నారు. తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో ఏటా 650 మంది చనిపోతున్నారు. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ప్రాంతాల్లో ఈ సంఖ్య 560గా ఉంది. తూర్పు, సెంట్రల్‌ ఆఫ్రికాలో అత్యధిక బాల్యవివాహాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో అక్కడ ఏటా 9600 (రోజుకు 26మంది) బాలికలు ప్రాణాలు కోల్పోతున్నట్లు సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ నివేదిక వెల్లడించింది. ఇలా చిన్న వయసులోనే వివాహ కావడం వల్ల ఎదురయ్యే గర్భాశయ సమస్యలు, మాతశిశు మరణాలు ప్రపంచ వ్యాప్తంగా ఏటా 22వేల ఉంటున్నట్లు తాజా నివేదిక తెలిపింది.

బాల్యవివాహాల నిర్మూలనకు గత కొన్ని దశాబ్దాలుగా కృషి జరుగుతోంది. ఇలా గడిచిన రెండున్నర దశాబ్దాల్లో దాదాపు 8 కోట్ల బాల్య వివాహాలను నివారించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణతో ఈ ఫలితాలు మళ్లీ మొదటికి వస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాలల మూతపడడం, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వంటి కారణాలతో పేదరికం మరింతగా పెరుగుతోంది. దీంతో 2030 నాటికి మరో కోటి మంది బాలికలు బాల్య వివాహాలకు తలవంచాల్సిన దుస్థితి ఏర్పడనున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. బాలికలకు ఇలాంటి ముప్పు పొంచివున్న నేపథ్యలో ప్రభుత్వాలు వారి ప్రాథమిక హక్కులను రక్షించడంతో పాటు బాలికలకు ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని సేవ్‌ ది చిల్డ్రన్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని