Covid: పొగరాయుళ్లకు కొవిడ్‌ ముప్పు తీవ్రం

ధూమపానం వల్ల కొవిడ్‌-19 తీవ్రత మరింత పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. అలాంటివారు ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో చనిపోయే ముప్పు ఎక్కువని హెచ్చరించింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌, బ్రిస్టల్‌, నాటింగ్‌హామ్‌ ..

Updated : 29 Sep 2021 09:35 IST

లండన్‌: ధూమపానం వల్ల కొవిడ్‌-19 తీవ్రత మరింత పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. అలాంటివారు ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో చనిపోయే ముప్పు ఎక్కువని హెచ్చరించింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌, బ్రిస్టల్‌, నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. కరోనా ప్రారంభమైన మొదట్లో జరిగిన కొన్ని అధ్యయనాల్లో పరస్పర విరుద్ధ అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌తో ఆసుపత్రిపాలయ్యేవారిలో.. సాధారణ జనాభాతో పోలిస్తే పొగరాయుళ్లు తక్కువగా ఉంటున్నట్లు కొన్నింట్లో స్పష్టమైంది. పలు అధ్యయనాల్లో మాత్రం కరోనా బారినపడినవారికి ధూమపానం పెను ముప్పేనని తేలింది. ఇవన్నీ పరిశీలనల్లో వెల్లడైన అంశాలే. వాటి వెనుక ఉన్న కారణాలు మాత్రం శాస్త్రవేత్తలకు బోధపడలేదు. తాజాగా బ్రిటన్‌లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల పరిశోధకులు శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. అందులో తొలిసారిగా ధూమపానానికి సంబంధించిన పరిశీలన,  జన్యు డేటాను, కొవిడ్‌ అంశాలను విశ్లేషించారు. ధూమపానప్రియులకు తీవ్ర కొవిడ్‌ ముప్పు పొంచి ఉందని తేల్చారు. ‘‘పొగతాగడం వల్ల గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లకు ఆస్కారం ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కొవిడ్‌ విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని