Hospital Admissions: దిల్లీలో పెరుగుతున్న ఆస్పత్రి చేరికలు

దేశ రాజధాని దిల్లీలో కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.పెరుగుతున్న కేసులతో పాటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి...

Published : 05 Jan 2022 23:58 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.పెరుగుతున్న కేసులతో పాటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నట్లు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రి వైద్యులు డా.సురేశ్‌ కుమార్‌ వెల్లడించారు. కరోనా రోగుల కోసం 2000 పడకలు రిజర్వ్‌ చేయగా అందులో బుధవారం నాటికి కేవలం 45 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రోజువారీగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రెండు లేదా మూడు నుంచి ఒక్కసారిగా 15-20కి పెరిగిందని పేర్కొన్నారు. అయితే తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నందున గతంలోలా ఒత్తిడికి గురికావడం లేదన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల్లో ఆక్సిజన్‌ అవసరం చాలా తక్కువగా ఉందని, ఇది ఊరటనిచ్చే అంశమని తెలిపారు. ఆస్పత్రిలో ఇప్పటి వరకు 35మంది ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా రోగులు చికిత్స పొందగా, ఒక్కరికి కూడా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ అవసరం రాలేదని డాక్టర్‌ వెల్లడించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి రేటు డెల్టాతో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువని, గత మూడు నాలుగు రోజులుగా గణనీయంగా పాజిటివ్‌ రోగులు ఆస్పత్రికి వస్తున్నారని తెలిపారు. గతంలో పదికంటే తక్కువ సంఖ్యలో కరోనా రోగులు రాగా, వారి సంఖ్య ప్రస్తుతం రెట్టింపయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు పరీక్షలు నిర్వహించే ఆరోగ్య కార్యకర్తల్లో అధిక శాతం మంది కరోనా బారిన పడుతుండటం ఆందోళనకరమని, మన ఆరోగ్య కార్యకర్తలను రక్షించుకోవడం ముఖ్యమన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని