Corona: భారత్‌లో 30-47లక్షల కరోనా మరణాలు!

భారత్‌పై రెండు దశల్లో విరుచుకుపడిన కరోనా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4

Updated : 20 Jul 2021 16:59 IST

అధికారిక లెక్కల కంటే 10రెట్లు ఎక్కువేనట..

దిల్లీ: భారత్‌పై రెండు దశల్లో విరుచుకుపడిన కరోనా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4.14లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అయితే వాస్తవంగా దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య ఇంతకంటే చాలా రెట్లు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తాజాగా వెలువడుతున్న అధ్యయనాలు ఆందోళనకర విషయాలను బయటపెడుతున్నాయి. భారత్‌లో కరోనా మరణాలు అధికారిక లెక్కల కంటే 10రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఓ పరిశోధకుల బృందం తాజాగా వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 30-47లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేసింది. 

భారత్‌లో కొవిడ్‌ పరిస్థితులు, మరణాలపై అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌, హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేశారు. ఇందులో ఒకరు భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ కావడం గమనార్హం. భారత్‌లో చాలా ప్రాంతాల్లో మృతుల సంఖ్యపై గణన నిర్దుష్టంగా జరగలేదని, అందువల్ల వాస్తవ మరణాలు అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువ ఉండొచ్చని వీరు తమ నివేదికలో పేర్కొన్నారు. 2020 జనవరి నుంచి 2021 జూన్‌ వరకు దేశంలో 30 నుంచి 47లక్షల మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. ప్రభుత్వ లెక్కల కంటే ఇది 10రెట్లు ఎక్కువని వెల్లడించారు. ‘‘వాస్తవ మరణాల సంఖ్య వందలు, వేలు, లక్షలు కాదు మిలియన్లలో ఉండొచ్చు. స్వాతంత్ర్యం తర్వాత భారత్‌లో నెలకొన్న అత్యంత ఘోరమైన మావన విషాదం ఇదే అయి ఉంటుంది’’ అని నివేదిక వెల్లడించింది. 

ఏడు రాష్ట్రాల్లో జనన, మరణాలు రికార్డు చేసే సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌(సీఆర్‌ఎస్‌), రక్తపరీక్షలు, ఆర్థిక సర్వేను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించారు. దేశంలో చోటుచేసుకున్న మరణాలకు సంబంధించిన అన్ని కారణాలను అధ్యయనం చేసి, వాటిని అంతక్రితం(కరోనా విజృంభణకు ముందు) ఏడాది మరణాలతో పోల్చిన అనంతరం ఈ అంచనాలు వెలువరించినట్లు నివేదిక తెలిపింది. 

ఇకపోతే.. భారత్‌లో మృతుల గణన సజావుగా లేదు. మహమ్మారికి ముందు కూడా చాలావరకు సాధారణ మరణాలు కూడా రికార్డుల్లో ఉండవు. గత కొద్ది నెలలుగా అనేక రాష్ట్రాలు కూడా కరోనా మరణాలు లెక్కలను సవరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో నమోదు కాని మరణాలు గుర్తించి ఇప్పుడు బయటపెడుతున్నాయి. వీటిని బట్టి చూస్తుంటే పెద్ద ఎత్తునే మరణాలు అధికారికంగా రికార్డు కావడం లేదనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు భారత్‌లో కరోనా మరణాల రేటు(10లక్షల మంది జనాభాకు చొప్పున లెక్కించే రేటు).. ప్రపంచ సగటు మరణాల రేటు కంటే చాలా తక్కువగా ఉంది. ఇది కూడా అనుమానాలకు తావిస్తోందని నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉండగా.. కేంద్రం మాత్రం ఈ అధ్యయనాలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే వస్తోంది. కొవిడ్ డేటా మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోందని.. కరోనా మరణాల నమోదు ప్రక్రియకు కచ్చితమైన విధానాన్ని పాటిస్తున్నామని పునరుద్ఘాటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన మూడో దేశం భారత్‌. అత్యధికంగా అమెరికాలో 6లక్షలు, బ్రెజిల్‌లో 5.42లక్షల మంది కొవిడ్‌కు బలయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని