Free Ration: అసమర్థ పంపిణీ వ్యవస్థ, స్వార్థ శక్తుల వల్లే..!

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు బడ్జెట్‌లో కేటాయింపులు, పలు పథకాలు పెరిగినప్పటికీ అసమర్థ పంపిణీ వ్యవస్థ, స్వార్థ వ్యక్తుల వల్లే పేదలకు ఆశించినంతగా లబ్ధి చేకూరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 03 Aug 2021 22:54 IST

‘పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన’ అవగాహన కార్యక్రమంలో ప్రధాని మోదీ

దిల్లీ: స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు బడ్జెట్‌లో కేటాయింపులు, పలు పథకాలు పెరిగినప్పటికీ అసమర్థ పంపిణీ వ్యవస్థ, స్వార్థ వ్యక్తుల వల్లే పేదలకు ఆశించినంతగా లబ్ధి చేకూరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలి కడుపుతో నిద్రించకూడదన్నదే తమ ప్రభుత్వ అభిమతమని.. అందుకే కరోనా సంక్షోభ సమయంలో ప్రతిఒక్కరికీ ఉచితంగా రేషన్‌ అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (PM-GKAY)’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని పునరుద్ఘాటించారు. PM-GKAY అవగాహన కార్యక్రమాన్ని గుజరాత్‌లో ప్రారంభించిన ఆయన.. కొవిడ్‌ సంక్షోభ సమయంలో లక్షల మంది నిరుపేదల బాధలను తగ్గించడంలో ఆహార భద్రతా పథకం దోహదపడిందన్నారు.

‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు పేదలకు చౌక ధరలో ఆహార పదార్థాలను అందిస్తాయని చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రతి ఏడాది ఏడాదికి బడ్జెట్‌లోనూ కేటాయింపులు పెరిగాయి. కానీ, వాటి ప్రభావం మాత్రం తక్కువగానే కనిపించింది. ముఖ్యంగా ఆహార నిల్వలు పెరిగినప్పటికీ ఆకలి, పోషకాహార లోపం మాత్రం ఆ నిష్పత్తిలో తగ్గలేదు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకు వ్యవస్థలో చొరబడ్డ కొన్ని స్వార్థ శక్తులే కారణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు.. నూతన సాంకేతికతతో 2014 నుంచి కొత్త మార్గాన్ని అనుసరించామని ప్రధాని మోదీ తెలిపారు. వీటి సహాయంతో కోట్ల సంఖ్యలో నకిలీ లబ్ధిదారులను తొలగించడంతో పాటు రేషన్‌ కార్డులను ఆధార్‌కు అనుసంధానం చేశామని చెప్పారు. తద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తేవడంతో పాటు నూతన సాంకేతికతను ప్రోత్సహించేందుకు కృషి చేశామన్నారు.

ఇక మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ ప్రభుత్వం లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో పేదల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచే లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ ముందకు సాగుతున్నామని చెప్పారు. మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ పౌరులకు అన్నివిధాలా సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని