Irom Sharmila: ‘ప్రజల ప్రాణాలంటే విలువలేదా? ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిందే’

సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని కోరుతూ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల మరోమారు డిమాండ్‌ చేశారు.....

Published : 14 Dec 2021 01:53 IST

దిల్లీ: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని కోరుతూ.. 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల మరోమారు ఈ అంశంపై గళమెత్తారు. నాగాలాండ్‌లో పౌరులపై పోలీసుల కాల్పుల నేపథ్యంలో తాజాగా మాట్లాడారు. ఈ ఘటనతోనైనా ప్రభుత్వం కళ్లుతెరవాలని పేర్కొన్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం కారణంగా ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మండిపడ్డ షర్మిల.. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో ఇరోమ్‌ షర్మిల మాట్లాడారు. ‘ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలో నాగాలాండ్​ ఘటన మరోసారి వెల్లడిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రజల ప్రాణాలు మరీ అంత విలువలేనివి కావు. ఈ చట్టం కారణంగా ఈశాన్య ప్రాంత ప్రజలు ఇంకా ఎన్నిరోజులు బాధలు పడాలి? తిరుగుబాటు నెపంతో మీరు ప్రజల కనీస హక్కులను హరించలేరు. తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉన్నాయి. 1958లో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పటి నుంచి కేంద్రం తాము అనుకున్నది ఏమైనా సాధించిందా? లేదంటే మరి ఈ చట్టం ఎందుకు?’ అని షర్మిల ప్రశ్నించారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని రద్దు చేయడంపై దృష్టి సారించాలని ఉక్కు మహిళ కోరారు. ఛత్తీస్​గఢ్​లో ఏళ్ల నుంచి మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారని, మరి అక్కడ ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు.

నాగాలాండ్- మయన్మార్ సరిహద్దుల్లో మోన్ జిల్లాలో ఈ డిసెంబరు 5న మిలిటెంట్లుగా భావించి ట్రక్కులో ప్రయాణిస్తున్న పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కాల్పుల్లో ఓటింగ్‌ గ్రామానికి మొత్తం 14 మంది పౌరులు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. కాగా పౌరుల మృతికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల పరిహారం అందిస్తామని తెలిపింది. అయితే కాల్పులకు తెగబడ్డ కమాండోలను న్యాయపరంగా శిక్షించాలని ఓటింగ్‌ గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పరిహారం తీసుకోబోమని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని