Pegasus: ప్రభుత్వానికి, పార్టీకి సంబంధం లేదు..!

పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌ అయినట్లు వస్తోన్న నివేదికలకు భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ఐటీశాఖ మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Published : 19 Jul 2021 20:52 IST

 కాంగ్రెస్‌వి నిరాధార ఆరోపణలన్న కేంద్రమాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వస్తోన్న వార్తలతో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ఐటీశాఖ మాజీ మంత్రి, భాజపా అధికార ప్రతినిధి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. హ్యాకింగ్‌ నివేదికలు విడుదల చేస్తోన్న సంస్థలు కూడా ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. కేవలం పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగించేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి నిరాధార, రాజకీయ ఆరోపణలను చేస్తోందని దుయ్యబట్టారు. అంతేకాకుండా లీక్‌ అయిన డేటాబేస్‌లో ఫోన్‌ నెంబర్‌ ఉన్నంత మాత్రాన అది హ్యాకింగ్‌ గురైనట్లు కాదని.. కథనాలు ప్రచురిస్తోన్న సదరు వార్తా సంస్థలే వెల్లడిస్తున్న విషయాన్ని రవిశంకర్‌ ప్రసాద్‌ గుర్తుచేశారు. దేశ ప్రజల గోప్యత హక్కును పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.

పెగాసస్‌ హ్యాకింగ్‌ కథనాలను ప్రచురిస్తోన్న సంస్థలపైనా భాజపా అధికార ప్రతినిధి రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు. ఈ నివేదికలు విడుదల చేస్తోన్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థకు భారత వ్యతిరేకి అనే ముద్ర ఉందని ఆరోపించారు. ఇక భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ఇలాంటి వార్తలు రావడం కాకతాళీయం కాదని అభిప్రాయపడ్డారు. అటు పెగాసస్‌ హ్యాకింగ్‌పై స్పందించిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఇలాంటి చర్యలన్నీ పనికిరానివని అని కొట్టిపారేశారు.

ఐదు సార్లు ఫోన్‌ మార్చా..అయినా హ్యాక్‌..

పెగాసస్‌ లిస్టులో తన ఫోన్‌ నెంబర్‌ ఉన్నట్లు వార్తలు వస్తుండడంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ స్పందించారు. ఇప్పటివరకు తన ఫోన్‌ను ఐదుసార్లు మార్చినప్పటికీ తన ఫోన్‌ హ్యాకింగ్‌ గురవుతోందని వెల్లడించారు. ఫోరెన్సిక్‌ విశ్లేషణలోనూ ప్రశాంత్‌ కిశోర్‌ ఫోన్‌ హ్యాకింగ్‌కు ప్రభావితమైనట్లు ‘ది వైర్‌’ కథనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని