
Tushar Gandhi: కంగనకు దీటుగా బదులిచ్చిన గాంధీ మునిమనవడు
మరో చెంప చూపాలంటే చాలా ధైర్యం కావాలని వ్యాఖ్య
దిల్లీ: ‘ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి’ అంటూ మహాత్మా గాంధీ ప్రవచించిన సూత్రాన్ని ఎద్దేవా చేస్తూ ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మహాత్ముడి ముని మనవడు దీటుగా బదులిచ్చారు. మరో చెంప చూపించడానికి గాంధీ ద్వేషులు అనుకున్న దానికంటే ఎక్కువ ధైర్యం కావాలని గట్టి సమాధానమిచ్చారు.
‘గాంధేయవాదులు మరో చెంప మాత్రమే చూపిస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, అలా రెండో చెంప చూపించాలంటే ఎంత ధైర్యం అవసరమో ఆ పిరికి వ్యక్తులకు అర్థం కాదు. వారు ఆ వీరత్వాన్ని అర్థం చేసుకోలేని అసమర్థులు. ఆనాటి భారతీయులు అలాంటి ధైర్యాన్ని సమృద్ధిగా ప్రదర్శించారు. వారంతా హీరోలు. అలాగే భిక్షగాడు అని పిలవడాన్ని బాపు స్వాగతించారు. తన దేశం, ప్రజల కోసం ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు. అర్ధ నగ్న ఫకీరు అంటూ బ్రిటీష్ ప్రధాని కొట్టిపారేసినా.. చివరకు ఆ దేశం గాంధీ ఎదుట లొంగిపోవాల్సి వచ్చింది. అబద్ధాలను ఎంత బిగ్గరగా అరిచి చెప్పినా.. నిజం నిలకడగా ఉంటుంది. అయితే, ఈ అబద్ధాలపై స్పందించాల్సి ఉంది’ అని ఓ కథనంలో తుషార్ రాసుకొచ్చారు.
1947లో కాదు.. 2014లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందంటూ కొద్ది రోజుల క్రితం కంగన వివాదాలకు తెరలేపింది. అక్కడితో ఆగకుండా మహాత్ముడిని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు అప్పట్లో గాంధీ నుంచి మద్దతు లభించలేదని తన శైలిలో చెప్పుకొచ్చింది. అయితే, ఆమె వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వీటిపై బోస్ కుమార్తె అనితా బోస్ స్పందించగా.. ఇప్పుడు తుషార్ గాంధీ గట్టిగా బదులిచ్చారు.