PM Modi: ఆ స్ఫూర్తితోనే కొత్త నేర చట్టాలను రూపొందించాం: ప్రధాని మోదీ

పోలీసులు తమను తాము అత్యాధునిక, ప్రపంచ స్థాయి శక్తిగా మలచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Published : 07 Jan 2024 23:34 IST

జైపుర్‌: ‘‘పౌరులు, గౌరవం, న్యాయానికే మొదటి ప్రాధాన్యం’’ అనే స్ఫూర్తితో కొత్త నేర చట్టాలను రూపొందించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. పోలీసులు ఇప్పుడు డండా(లాఠీ)కు బదులుగా డేటా (సమాచారం)తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపుర్‌లో నిర్వహించిన ‘డీజీపీలు, ఐజీపీల సదస్సు’లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడైనా, ఎక్కడైనా మహిళలు నిర్భయంగా పని చేయగలిగేలా.. వారి భద్రతపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు.

కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలు.. భారత నేర న్యాయవ్యవస్థలో మార్పులకు నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళలు, బాలికలకు వారి హక్కులు, రక్షణ గురించి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఎదగాలనే ఆశయాన్ని నెరవేర్చేందుకు.. పోలీసులు తమను తాము అత్యాధునిక, ప్రపంచ స్థాయి శక్తిగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోలు.. సముద్రపు దొంగల ఆట కట్టించిన ఘటనను ప్రస్తావించారు.

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అక్కసు వెళ్లగక్కిన మాల్దీవులు ఎంపీ

ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాధార చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ పేరుతో కొత్త చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే. వలస పాలన తాలూకు గుర్తులను చెరిపేస్తూ.. భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని