Kiren Rijiju: కేంద్ర న్యాయశాఖ మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) వాహనాన్ని ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. అయితే, ఈ ఘటన నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

Updated : 08 Apr 2023 20:56 IST

దిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)కి త్రుటిలో ప్రమాదం తప్పింది. జమ్ము కశ్మీర్‌ పర్యటనకు వెళ్తుండగా.. రంబన్‌ జిల్లా బనిహల్‌ ప్రాంతంలో ఆయన కారును ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. అయితే, ఈ ఘటన నుంచి మంత్రి సురక్షితంగా బయటపడటంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఉదంపూర్‌ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు రిజిజు వాహనాన్ని ఢీ కొట్టినట్లు  అదనపు డీజీ ముకేశ్‌ సింగ్‌ తెలిపారు.

ప్రమాదం జరగ్గానే భద్రతా సిబ్బంది మెరుపువేగంతో మంత్రి కారువద్దకు చేరుకున్నారు. కారు డోర్లు తెరిచి మంత్రిని బయటకు తీశారు. ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్‌ వెళ్లిన ఆయన.. ఉదంపూర్‌ వరకు కారులో ప్రయాణించారు.‘ ఈ అందమైన రహదారిని ఎవరైనా ఆస్వాదించవచ్చు’ అంటూ విశాలవంతమైన రహదారి చూపిస్తూ తీసిన వీడియోను ట్విటర్‌లో ఇవాళ ఉదయం పోస్టు చేశారు. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని