Srinagar Encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ-కశ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. శనివారం ఉదయం శ్రీనగర్‌లోని జకురా ప్రాంతంలో స్థానిక పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో.. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల...

Published : 05 Feb 2022 23:39 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. శనివారం శ్రీనగర్‌లోని జకురా ప్రాంతంలో స్థానిక పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో.. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాగిఉన్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరిని ఇఖ్లాక్ హజామ్‌గా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల అనంత్‌నాగ్ జిల్లాలోని హసన్‌పొరాలో హెడ్ కానిస్టేబుల్ అలీ ముహమ్మద్ గనీ హత్య కేసులో హజామ్ ప్రమేయం ఉన్నట్లు ఐజీపీ తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్తోళ్లు, ఇతర సామగ్రినీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

కుల్గాం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గనీపై జనవరి 29న హసన్‌పోరాలో ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ వారం ప్రారంభంలోనూ షోపియాన్ జిల్లాలోని అమిషిజిపోరా ప్రాంతంలో ఓ ఏఎస్సైపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా భద్రతాబలగాలు కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జనవరిలోనే దాదాపు పదికి పైగా ఎన్‌కౌంటర్లు నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని