Udaipur Murder: దర్జీ హత్య కేసు.. హంతకులకు అంతర్జాతీయ సంబంధాలు: సీఎం అశోక్ గహ్లోత్‌

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ దారుణ హత్య ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లత్‌ కీలక విషయాలు వెల్లడించారు.

Published : 30 Jun 2022 01:42 IST

దిల్లీ: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ దారుణ హత్య ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లత్‌ కీలక విషయాలు వెల్లడించారు. దర్జీ హత్య ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. హత్యకు కారుకులైన ఇద్దరు నిందితులకు అంతర్జాతీయంగా ఉగ్రవాద సంబంధాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. హత్య ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ.. ఉన్నతాధికారులతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు. నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

‘‘దర్జీ హత్య కేసు ఘటనపై తదుపరి విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేపడుతుంది. వారికి రాజస్థాన్‌ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) సహాయ సహకారాలు అందిస్తుంది. రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశాం’’ అని అశోక్‌ గహ్లత్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, కన్హయ్యలాల్‌ హత్య ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ బృందం ఇప్పటికే ఉదయపుర్ చేరుకుంది. దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే దర్జీ హత్యపై కేసు నమోదు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని