సామాన్యులే మా మిత్రులు..

సంపన్నులు, ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్‌ తీసుకొచ్చిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గట్టిగా బదులిచ్చారు. తమకు మిత్రులంటే

Updated : 13 Feb 2021 13:23 IST

లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: సంపన్నులు, ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్‌ తీసుకొచ్చిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గట్టిగా బదులిచ్చారు. తమకు మిత్రులంటే ఈ దేశ సామాన్య ప్రజలేనని, వారికోసమే బడ్జెట్‌ రూపొందించామని తెలిపారు. బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు శనివారం ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌పై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

ఆత్మనిర్భర్‌ భారత్‌కు బడ్జెట్‌ బాటలు

2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌.. భారత్‌ ఆత్మనిర్భర్‌గా అవతరించేందుకు బాటలు వేస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదని, దీర్ఘకాలం కోసం పెట్టుకున్న లక్ష్యాలను సాధించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ సంస్కరణలతో భారత మరింత ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని తెలిపారు.

మా ప్రభుత్వం ప్రజల కోసమే.. 

‘‘ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమే బడ్జెట్‌ తెచ్చామని విపక్షాలు అంటున్నాయి. కానీ మా ప్రభుత్వం సంపన్నుల కోసం పనిచేయట్లేదు.. మాకు మిత్రులంటే ఈ దేశ సామాన్య ప్రజలే. వారి కోసమే ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని ఆర్థిక మంత్రి విపక్షాలపై విరుచుకుపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.73వేల కోట్లు కేటాయించామని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి ఆరోగ్యరంగానికి అధిక ప్రాధాన్యం కల్పించామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపిందని అన్నారు. 

దేశీయ వ్యాపార నైపుణ్యాలు, భారత యువతపై తమకు అపారమైన నమ్మకముందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వారికోసం ఎన్నో సంస్కరణలు చేపట్టామని చెప్పారు. బడ్జెట్‌, రైతుల ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

తూర్పు లద్దాఖ్‌కు పార్లమెంటరీ కమిటీ!

బడ్జెట్‌పై విపక్షాల దుష్ప్రచారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని