Electoral bonds: ‘నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువని రుజువైంది’: సుప్రీం తీర్పుపై కాంగ్రెస్‌

Electoral bonds Scheme: ఎన్నికల బాండ్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ స్వాగతించింది. కరెన్సీ నోట్ల కంటే ప్రజలు వేసే ఓటుకే బలం ఎక్కువ అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపర్చిందని హర్షం వ్యక్తం చేసింది.

Published : 15 Feb 2024 13:22 IST

Electoral bonds scheme | దిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు (Supreme Court) వెలువరించిన తీర్పుపై కాంగ్రెస్‌ (Congress) పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం, ఈసీ తీరుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దీనిపై స్పందిస్తూ.. ‘‘ఎన్నికల బాండ్లను మోదీ సర్కారు కమీషన్లకు మాధ్యమంగా మార్చేసింది. ఈ రోజు ఇది కోర్టులో రుజువైంది’’ అని దుయ్యబట్టారు.

‘‘మోదీ సర్కారు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం.. పార్లమెంట్ ఆమోదించిన రెండు చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపర్చింది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో రాసుకొచ్చారు.

‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం సంచలన తీర్పు

చందాలిచ్చే దాతలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం.. అన్నదాతలకు పదే పదే అన్యాయం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. వీవీప్యాట్ల సమస్యలపై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యేందుకు ఈసీ ప్రతిసారీ నిరాకరిస్తోందని, ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటింగ్‌ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుంటే.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యే విషయంలో ఎందుకింత మొండితనంగా వ్యవహరిస్తున్నారని ఈసీని ప్రశ్నించారు.

ఎన్నికల బాండ్ల పథకం సమాచార హక్కు, ఆదాయపు పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ విరాళాలు క్విడ్‌ ప్రోకోకు దారితీయొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే ఎన్నికల బాండ్ల జారీని ఎస్‌బీఐ నిలిపివేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని