Chandrayaan-3: కర్తవ్యం పరిసమాప్తం!.. నిద్రాణంలోకి ల్యాండర్‌..!

రెండు వారాలపాటు చంద్రుడి దక్షిణ ధ్రువంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించిన ల్యాండర్‌, రోవర్‌లు (Chandrayaan 3).. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయినట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది.

Updated : 04 Sep 2023 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోకి మొన్నటివరకు ఏ దేశం అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ (Lunar Mission) భాగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) పంపించిన చంద్రయాన్‌-3 విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్‌, రోవర్‌లు.. రెండు వారాలపాటు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే రోవర్‌ నిద్రాణ స్థితిలోకి వెళ్లగా.. తాజాగా ల్యాండర్‌ కూడా అందుకు సిద్ధమైంది. ఈ రోజు ల్యాండర్‌ విక్రమ్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లనుందని ఇస్రో ప్రకటించింది. అంతకుముందు జరిపిన హాప్ ఎక్స్‌పరిమెంట్‌ అనంతరం కొత్త ప్రదేశంలోనూ అందులోని పేలోడ్‌లు పనిచేసినట్లు తెలిపింది.

‘భారత కాలమాన ప్రకారం.. 8 గంటల ప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్తుంది. అంతకుముందు జరిపిన ప్రయోగం తర్వాత.. కొత్త ప్రదేశంలోనూ అందులోని రాంభా, చాస్టే, ఐఎల్‌ఎస్‌ఏ పేలోడ్‌లు పనిచేశాయి. వాటి సమాచారం భూమికి చేరింది. పేలోడ్‌లన్నీ ప్రస్తుతం స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. ల్యాండర్‌ రిసీవర్లు మాత్రం ఆన్‌లోనే ఉన్నాయి. సౌరశక్తి తగ్గి బ్యాటరీ ఖాళీ అయిన తర్వాత ప్రజ్ఞాన్‌ పక్కనే విక్రమ్‌ కూడా నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుంది. సెప్టెంబర్‌ 22న మళ్లీ తిరిగి అవి మేలుకుంటాయని ఆశిస్తున్నాం’ అని ఇస్రో (ISRO) వెల్లడించింది. ఇక హాప్ ఎక్స్‌పరిమెంట్‌ జరిగే ముందు, ఆ తర్వాత ల్యాండర్‌ స్థితికి సంబంధించిన ఫొటోలనూ ఇస్రో పోస్టు చేసింది.

ISRO: మరోసారి సురక్షితంగా ల్యాండ్‌ అయిన విక్రమ్‌

ఇదిలాఉంటే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం జులై 14న ఇస్రో చంద్రయాన్‌-3ని ప్రయోగించింది. అనంతరం 40 రోజులపైగా ప్రయాణం చేసిన చంద్రయాన్‌.. ఆగస్టు 23న జాబిల్లిపై విజయవంతంగా దిగింది. అనంతరం శాస్త్రవేత్తలు నిర్దేశించిన విధంగా పనిచేసిన ల్యాండర్‌, రోవర్‌లు అక్కడ పరిశోధనలు చేపట్టాయి. వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు భూమికి చేరవేశాయి.

ఆ తర్వాత ఏం జరుగుతుంది..?

సోలార్‌ ప్యానెల్‌ల ద్వారా శక్తి పొందే విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ల జీవితకాలం 14 రోజులే. చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారు. సూర్యాస్తమయం సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ల్యాండర్‌, రోవర్‌ వ్యవస్థలు మనుగడ సాగించడం సాధ్యం కాదు. 14 రోజుల తర్వాత మళ్లీ అక్కడ సూర్యోదయం అవుతుంది. ఆ సమయంలో ల్యాండర్‌, రోవర్‌లపై సూర్యరశ్మి పడి, మళ్లీ అవి పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే సూర్యకాంతిని అందుకునేలా రోవర్ ఫలకం దృక్కోణాన్ని మార్చారు. సెప్టెంబర్‌ 22న వచ్చే సూర్యోదయంతో ఒకవేళ అవి పనిచేస్తే మాత్రం అదనపు ప్రయోజనమేనని భారత శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లేదంటే.. చంద్రుడిపై అవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని