ISRO: మరోసారి సురక్షితంగా ల్యాండ్‌ అయిన విక్రమ్‌.. ఇస్రో ట్వీట్

చంద్రయాన్‌-3 ల్యాండర్ గురించి తాజాగా ఇస్రో(ISRO) మరో ట్వీట్ చేసింది. ఆ ల్యాండర్ మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించింది.

Updated : 04 Sep 2023 15:14 IST

దిల్లీ: చంద్రయాన్‌-3(Chandrayaan-3) కొద్దిరోజుల క్రితం దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా దిగి, చరిత్ర సృష్టించింది. తాజాగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై మరోసారి సురక్షితంగా దిగిందని ఇస్రో(ISRO) వెల్లడించింది. 

‘చంద్రయాన్‌-3(Chandrayaan-3) మిషన్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను మించి విక్రమ్‌ ల్యాండర్(Vikram Lander) పనితీరును ప్రదర్శించింది. అది విజయవంతంగా హాప్ ఎక్స్‌పరిమెంట్‌ను పూర్తిచేసింది. మేం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్ తన ఇంజిన్లను మండించింది. అనుకున్న విధంగా 40 సె.మీ గాల్లోకి లేచి, 30 నుంచి 40 సె.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. జాబిల్లిపై నమూనాలను భూమి మీదకు తీసుకురావడానికి, మానవ సహిత యాత్రల విషయంలో ఇది మనకు ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ ల్యాండింగ్‌ తర్వాత కూడా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి’  అని ఇస్రో(ISRO) ట్వీట్ చేసింది. 

జీ-20 వేళ సరిహద్దుల్లో వాయుసేన గర్జన.. యుద్ధ విన్యాసాలు మొదలు పెట్టిన భారత్‌..!

ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన ల్యాండర్, రోవర్ తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసుకొని, విశ్రాంతికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తొలుత రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి పంపేసినట్లు శనివారం రాత్రి ఇస్రో వెల్లడించింది. మళ్లీ ఈ నెల 22న శివ్‌శక్తి పాయింట్ వద్ద సూర్యోదయమవుతుందని, ఆ రోజున సూర్యకాంతిని అందుకునేలా రోవర్ ఫలకం దృక్కోణాన్ని మార్చినట్లు తెలిపింది. దాని రిసీవర్‌ను ఆన్‌ చేసినట్లు తెలిపింది. ఆ రోజు అది క్రియాశీలకం కాకుంటే.. చంద్రమండలంపై భారత రాయబారిగా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని