CoronaVirus వదిలి పెట్టదు: మోడెర్నా సీఈవో

కరోనా వైరస్‌ మనల్ని వదలిపెట్టదని, మరికొద్ది రోజుల్లో  కరోనా సరికొత్త స్ట్రెయిన్‌ ప్రపంచాన్ని  ఉక్కిరిబిక్కిరి చేయబోతోందని ప్రముఖ అమెరికా ఔషధతయారీ సంస్థ మోడెర్నా సీఈవో స్టెఫేన్ బాన్సల్‌  అన్నారు. మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కోవడానికి..

Published : 07 May 2021 01:42 IST

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ మనల్ని వదలిపెట్టదని, మరికొద్ది రోజుల్లో కరోనా సరికొత్త స్ట్రెయిన్‌ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతోందని ప్రముఖ అమెరికా ఔషధ తయారీ సంస్థ మోడెర్నా సీఈవో స్టెఫేన్ బాన్సల్‌ అన్నారు. మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. దక్షిణాది దేశాల్లో జూన్‌ నెలలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని, ఆ సమయంలో వైరస్‌ మరింత విజృంభించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే బూస్టర్‌ డోస్‌లు అవసరమవుతాయని ఆయన తెలిపారు. బ్రెజిల్‌, సౌత్‌ ఆఫ్రికా స్ట్రెయిన్లను తట్టుకునేలా కొత్త వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు మోడెర్నా ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గతంలో మొడెర్నా టీకాలు వేసుకున్న కొందరి వ్యక్తులపై బూస్టర్‌ డోస్‌ను పరీక్షించామని, సత్ఫలితాలు వచ్చాయని మోడెర్నా వెల్లడించింది. బూస్టర్‌ డోసు ఇచ్చిన వాలంటీర్లలో వ్యాధినిరోధక శక్తి అనూహ్యంగా పెరిగిందని తెలిపింది. సౌత్‌ ఆఫ్రికా స్ట్రెయిన్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బూస్టర్‌ డోసు ఎంఆర్‌ఎన్‌ఏ 1273.351 మంచి ఫలితాలనిస్తోందని, దీంతోపాటు గతంలో తయారు చేసిన వ్యాక్సిన్ కూడా బాగా పనిచేస్తోందని మోడెర్నా వెల్లడించింది. అయితే బూస్టర్‌ డోసు అవసరం లేకుండా ఒకేసారి వ్యాక్సిన్‌ ఇచ్చేవిధంగా ప్రయోగాలు జరుపుతున్నట్లు తెలిపింది. ‘‘తాజా ఫలితాలతో నూతనోత్సాహం కలిగింది. వివిధ స్ట్రెయిన్లను అడ్డుకునే బూస్టర్‌ డోసులు తయారు చేయగలమన్న నమ్మకం ఏర్పడింది’’ అని మోడెర్నా ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని