Himachal Pradesh: హిమాచల్‌లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటర్లు భారీగా తరలిరావాలన్న మోదీ..!

హిమాచల్‌లో రెండోసారి  వరుసగా అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని భాజపా ఆశిస్తోంది. అధికార పక్షాన్ని ఓడించి విపక్ష పార్టీకి పట్టం కట్టే సంప్రదాయం ఉన్న రాష్ట్రం కనుక ఈ దఫా తమకు విజయం తథ్యమని కాంగ్రెస్ భావిస్తోంది.

Updated : 12 Nov 2022 10:22 IST

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 412 మంది బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా హిమాచల్ వాసులంతా ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

‘దేవభూమి ప్రజలంతా ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్ని సరికొత్త చరిత్ర సృష్టించాలని కోరుతున్నారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువతకు నా శుభాకాంక్షలు’ అని అన్నారు. ‘మీ అందరికీ రాష్ట్ర పరిస్థితిపై అవగాహన ఉంది. అందుకు తగ్గట్టుగా ఓటు హక్కును వినియోగించుకోండి’ అని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఆయన కుటుంబం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దానికి ముందు మండీలోని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. అలాగే ప్రజలంతా ఓటింగ్‌కు భారీగా తరలిరావాలని కోరారు. 

ఈ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. వందల సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎన్నికల సంఘం ప్రకారం.. 55,92,828 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. రెండోసారి  వరుసగా అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని భాజపా ఆశిస్తుండగా.. అధికార పక్షాన్ని ఓడించి విపక్ష పార్టీకి పట్టం కట్టే సంప్రదాయం ఉన్న రాష్ట్రం కనుక ఈ దఫా తమకు విజయం తథ్యమని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరికొన్ని పార్టీలు కూడా బరిలో నిలిచాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని