Helicopter Crash: పైలట్ అయోమయం వల్లే సీడీఎస్‌ హెలికాప్టర్‌ప్రమాదం

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ దుర్ఘటనపై త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదిక బయటకు వచ్చింది. వాతావరణంలో చోటుచేసుకున్న అనుకోని మార్పులతో పైలట్‌ అయోమయానికి గురికావడం వల్లే.......

Updated : 15 Jan 2022 10:42 IST

దిల్లీ: సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ దుర్ఘటనపై త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదిక బయటకు వచ్చింది. వాతావరణంలో చోటుచేసుకున్న అనుకోని మార్పులతో పైలట్‌ అయోమయానికి గురికావడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు స్పష్టంచేసింది. ఇందులో ఎలాంటి కుట్రకోణంలేదనీ.. సాంకేతిక లోపాలూ కారణం కాదని త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఎయిర్‌ మార్షల్‌ మాన్వేంద్ర సింగ్ నేతృత్వంలోని త్రివిధ దళాల కోర్ట్‌ ఆఫ్ ఎంక్వైరీ విచారణ నివేదికలోని అంశాలను భారత వాయుసేన బహిర్గతం చేసింది. హెలికాప్టర్‌ ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాలనూ పరిశీలించి ఈ బృందం నివేదికను రూపొందించినట్టు వాయుసేన పేర్కొంది. 

‘‘లోయలోని వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ మేఘాలలోకి ప్రవేశించింది. అక్కడి పరిస్థితులతో పైలట్ అయోమయానికి గురికావడంతో హెలికాఫ్టర్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక తప్పిదాలు దొర్లలేదు ’’ అని నివేదికలో పేర్కొంది.

హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నియమించిన విచారణ బృందం హెలికాఫ్టర్‌ డేటా రికార్డర్‌తోపాటు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను విశ్లేషించింది. దాంతోపాటే ప్రమాదం జరగడానికి కారణాలను తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న సాక్షులందరినీ దర్యాప్తు బృందం ప్రశ్నించిందని వాయుసేన తెలిపింది. సాంకేతికత, యాంత్రిక కారణాల వల్ల ప్రమాదం జరిగిందనే ఆరోపణలను తోసిపుచ్చింది. 2021, డిసెంబర్‌ 8న భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా రావత్‌ సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోవడం యావత్‌ దేశాన్ని విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని