కేంద్రమంత్రి నోట మాంద్యం మాట.. మోదీ, నిర్మలపై కాంగ్రెస్‌ విమర్శలు

ఈ ఏడాది జూన్‌ తర్వాత ఆర్థిక మందగమనం పరిస్థితులు భారత్‌ చవిచూసే అవకాశం ఉందని కేంద్రమంత్రి నారాయణ రాణె అన్నారు. ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 

Published : 17 Jan 2023 14:26 IST

దిల్లీ: గత కొద్ది రోజులుగా ఆర్థిక మాంద్యం (Recession) గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ఏడాది మాంద్యం పరిస్థితులు తలెత్తబోతున్నాయంటూ ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌ వంటి సంస్థలు హెచ్చరించాయి. భారత్‌లోనూ దీని ప్రభావం ఉంటుందా? అనే భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల (MSME) శాఖ మంత్రి నారాయణ రాణె కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మాంద్యం పరిస్థితులు తలెత్తితే జూన్‌ తర్వాత ఉండే అవకాశం ఉందని, మాంద్యం ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

పుణెలో సోమవారం విలేకరులతో మాంద్యం గురించి రాణె మాట్లాడారు. కేబినెట్‌ మంత్రిగా తనకు కొంత సమాచారం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ సైతం కొన్ని సలహాలు, సూచనలు చేశారని చెప్పారు. ఇప్పటికే పెద్ద పెద్ద దేశాలు ఆర్థిక మాంద్యం పరిస్థితులు చూస్తున్నాయనేది వాస్తవమన్నారు. ఒకవేళ భారత్‌లో మాంద్యం పరిస్థితులు తలెత్తితే అది జూన్‌ తర్వాతేనని చెప్పారు. అయితే, ఆ ప్రభావం పడకుండా లేదా మందగమన పరిస్థితులు తలెత్తకుండా భారత ప్రభుత్వం, మోదీ కృషి చేస్తున్నారని రాణె వ్యాఖ్యానించారు.

రాణె చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లక్ష్యంగా ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు. రాబోయే ఆరు నెలల్లో మాంద్యం పరిస్థితులు తలెత్తనున్నట్లు స్వయంగా ఎంఎస్‌ఎంఈ శాఖ మాత్యులే చెప్పారని, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇంకా ఏం దాస్తున్నారని ప్రశ్నించారు. 2014 నుంచి ఎంఎస్‌ఎంఈ రంగం విధ్వంసానికి గురైందని దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు