Operation Cactus: ‘ఆపరేషన్‌ కాక్టస్‌’.. నాడు మాల్దీవుల్లో భారత సైన్యం అడుగుపెట్టిన వేళ..

Maldives-India: దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం మాల్దీవుల్లో భీకర తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో భారత బలగాలు ఈ దీవుల్లో అడుగుపెట్టి ఆ దేశ ప్రభుత్వాన్ని రక్షించాయి. ఇంతకీ ఆనాడు ఏం జరిగింది? ఏంటా ఆపరేషన్‌ కాక్టస్‌..?

Published : 16 Jan 2024 02:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత (India) ప్రధాని మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల (Maldives) మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలో తమ గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు చైనా అండతో దూకుడుగా ప్రవర్తిస్తున్న ఈ మాల్దీవులను.. ఒకప్పుడు భీకర తిరుగుబాటు నుంచి భారతే రక్షించింది. మన సైన్యం ఆ దీవుల్లో అడుగుపెట్టి శత్రుమూకలను తరిమికొట్టింది. ప్రపంచ దేశాలు కొనియాడిన ఆ ‘ఆపరేషన్‌ కాక్టస్‌ (Operation Cactus)’ గురించి తెలుసా..?

వ్యాపారి తిరుగుబాటుతో కల్లోలం..

1988 నవంబరులో మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లుతుఫీ.. అప్పటి మౌమూన్‌ అబ్దుల్ గయూమ్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. శ్రీలంకకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆఫ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (PLOTE) గ్రూప్‌ ఆయనకు సాయం చేసింది. నవంబరు 3 తెల్లవారుజామున ఈ గ్రూప్‌నకు చెందిన 80 మందితో కూడిన కిరాయి సైన్యం.. శ్రీలంకకు చెందిన వాణిజ్య నౌకను హైజాక్‌ చేసి మాలె చేరుకుంది. వీరు మాల్దీవుల్లో బీభత్సం సృష్టించారు. పోర్టులు, రేడియో స్టేషన్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడి భవనం దిశగా దూసుకెళ్లారు. తిరుగుబాటు గురించి తెలియగానే భద్రతా సిబ్బంది వెంటనే అధ్యక్షుడు గయూమ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీధుల్లో కాల్పులతో విరుచుకుపడిన ఆ కిరాయి సైన్యం కొంతమంది మంత్రులు, పౌరులను బందీలుగా చేసుకుంది.

సాయం కోసం భారత్‌ను అభ్యర్థించి..

గయూమ్‌పై గతంలోనూ రెండుసార్లు ఇలాంటి తిరుగుబాట్లు జరిగినా పరిణామాలు ఇంత తీవ్ర స్థాయిలో లేవు. కానీ, ఈసారి ఎదురైన ముప్పు నుంచి బయటపడే పరిస్థితి కన్పించలేదు. దీంతో సాయం కోసం గయూమ్‌ పొరుగు దేశాలను ఆశ్రయించక తప్పలేదు. కానీ, వారికి సాయం చేసేందుకు శ్రీలంక, పాకిస్థాన్‌, సింగపూర్‌ నిరాకరించాయి. అగ్రరాజ్యం అమెరికా సాయానికి ముందుకొచ్చినా.. సైన్యాన్ని పంపేందుకు రెండు, మూడు రోజులు పడుతుందని చెప్పింది. దీంతో గయూమ్‌.. అప్పటి బ్రిటిష్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌కు ఫోన్‌ చేశారు. అయితే, బ్రిటన్‌ సైన్యం కూడా ఈ దీవులకు చాలా దూరంలో ఉంది. దీంతో భారత్‌ను సాయం అడగాలని ఆమె సూచించారు. మరో ఆలోచన లేకుండా ఆయన భారత్‌ను అభ్యర్థించారు. అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. మన సైన్యాన్ని మాల్దీవులకు పంపించాలని నిర్ణయించారు.

అలా ఆపరేషన్‌ కాక్టస్‌..

ప్రధాని కార్యాలయం నుంచి విదేశీ సేవల అధికారి.. అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీఎన్‌ శర్మకు ఫోన్‌ చేశారు. ‘‘మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. శ్రీలంకకు చెందిన తీవ్రవాదులు ఆ దీవుల్లోకి ప్రవేశించి మాలెను స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు గయూమ్‌ ఓ పౌరుడి ఇంట్లో తలదాచుకున్నారు. మంత్రులు బందీలుగా ఉన్నారు. మన సైన్యం సాయం చేయగలదా?’’ అని ఆ అధికారి అడిగారు. వీఎన్‌ శర్మ.. ‘తప్పకుండా చేయగలం’ అని చెప్పారు. దీనికి ‘ఆపరేషన్‌ కాక్టస్‌’ అని కోడ్‌ నేమ్‌ పెట్టారు.

బ్రిగేడియర్‌ ఫారూఖ్‌ బల్సారా నేతృత్వంలో ఆగ్రా నుంచి మూడు పారాకమాండో బృందాలు మాలె అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. వెంటనే ఎయిర్‌పోర్టును తమ అధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి పడవల్లో మాలె నగరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక కిరాయి మూకలతో భారత సైన్యం భీకర పోరు సాగించింది. మన కమాండోల దెబ్బకు వారు తోకముడిచి పారిపోయారు.

అదే సమయంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ గోదావరి, ఐఎన్‌ఎస్‌ బెత్వా.. ఆ కిరాయి సైన్యం ప్రయాణిస్తున్న నౌకను అడ్డగించి వారిని పట్టుకున్నారు. ఈ పోరులో ఇద్దరు బందీలు ప్రాణాలు కోల్పోగా.. మరో 17 మంది శ్రీలంక కిరాయి ముఠా సభ్యులు హతమయ్యారు. ‘ఆపరేషన్‌ కాక్టస్‌’ విజయవంతమవడంపై ప్రపంచ దేశాలు భారత్‌ను ప్రశంసించాయి.

మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు..

ఈ ఆపరేషన్‌లో భారత్‌ అదుపులోకి తీసుకున్న శ్రీలంక కిరాయి ముఠా సభ్యులను 1989లో మాల్దీవులకు అప్పగించారు.  తిరుగుబాటు వెనుక మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహిమ్‌ నజీర్‌ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే మాల్దీవుల స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని అధ్యక్షుడు గయూమ్‌ క్షమాభిక్ష ప్రసాదించారు.

ఈ ఆపరేషన్‌ తర్వాత భారత్‌, మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతమైంది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ విధులు నిర్వర్తిస్తోంది. మన సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి. ఈ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయిజ్జు కోరడం వివాదాస్పదమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని