Sharukh Khan: షారుకా..? ఆయనెవరో నాకు తెలీదు: అస్సాం సీఎం

షారుక్ ఖాన్‌ ఎవరో తనకు తెలీదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. పఠాన్‌ సినిమా విడుదలను నిలిపేయాలంటూ రాష్ట్రంలో చోటుచేసుకున్న నిరసనలపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం చెప్పారు.

Published : 22 Jan 2023 01:10 IST

గువాహటి: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌(Sharukh Khan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పఠాన్‌(Pathaan) సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం వేళ జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. స్థానికంగా విడుదలను నిలిపివేయాలంటూ అస్సాం(Assam) రాజధాని గువాహటిలో బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆ సినిమా పోస్టర్లకు నిప్పంటించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనను మీడియా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) వద్ద శనివారం ప్రస్తావించారు. అయితే, షారుక్ ఎవరో తనకు తెలీదని హిమంత చెప్పడం గమనార్హం.

‘షారుక్‌ ఖాన్ ఎవరు? ఆయన గురించి నాకు తెలీదు. పఠాన్‌ చిత్రం గురించీ తెలీదు. ఈ సమస్యపై బాలీవుడ్ నుంచి అనేక మంది ఫోన్‌ చేశారు. ఖాన్ చేయలేదు. ఒకవేళ చేస్తే.. పరిశీలిస్తా. శాంతిభద్రతలను ఉల్లంఘించేవారిపై మాత్రం చర్యలు తీసుకుంటాం’ అంటూ మీడియా ప్రతినిధులకు హిమంత సమాధానం ఇచ్చారు. అంతకుముందు షారుక్‌ ఖాన్‌ ఓ బాలీవుడ్‌ స్టార్‌ అని మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా.. రాష్ట్ర ప్రజలు అస్సామీల గురించి ఆందోళన చెందాలని, హిందీ చిత్రాల గురించి కాదని అన్నారు. ఈ క్రమంలోనే త్వరలో వస్తున్న ఓ అస్సామీ సినిమా చూడాలంటూ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు