ఝార్ఖండ్‌లో గదినిండా నోట్లకట్టలు

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్‌ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి.

Updated : 07 May 2024 05:52 IST

రాష్ట్ర మంత్రి ప్రైవేటు కార్యదర్శి పనిమనిషి ఇంట్లో రూ.32 కోట్లు
మరో రెండు చోట్ల రూ.3 కోట్లు
ఈడీ సోదాల్లో వెలుగులోకి

రాంచీ: ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్‌ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. లోపల ఏ మూల ఏ సంచిని దులిపినా నోట్ల కట్టలే బయటపడ్డాయి. అనంతరం వాటిని లెక్కించగా ఏకంగా రూ.32 కోట్లని వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా వారు అవాక్కయ్యారు. మరో రెండు చోట్ల రూ.3 కోట్లను గుర్తించారు. అవినీతి ఆరోపణలపై గతేడాది అరెస్టయిన ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర కుమార్‌ రామ్‌కు సంబంధించిన హవాలా కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం రాంచీలో ఆరు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్‌ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్‌) సంజీవ్‌ లాల్‌ పనిమనిషి జహంగీర్‌ ఆలం నివాసంలో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా రూ.32 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి బయటకొచ్చిన వీడియో, ఫొటోల్లో.. ఇక్కడి గడిఖానా చౌక్‌ ప్రాంతంలోని రెండు పడకగదుల ఫ్లాట్‌లో పెద్ద పెద్ద సంచుల నుంచి అధికారులు నోట్ల కట్టలను బయటకు తీయడం కనిపించింది. కేంద్ర బలగాల సిబ్బంది కూడా వీడియోలో కనిపించారు. ఈ ఫ్లాట్‌లో సంజీవ్‌లాల్‌తో కలిసి ఆయన పనిమనిషి జహంగీర్‌ ఆలం ఉంటున్నట్లు సమాచారం. నగదును గుర్తించిన ఇంటి తాళాలు లాల్‌ ప్లాట్‌లో దొరికినట్లు తెలిసింది. కొన్ని ఆభరణాలను సైతం గుర్తించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.  మరో రెండు ప్రాంగణాల్లో వరుసగా రూ.2.93 కోట్లు, రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి. దీంతో మొత్తంగా రూ.35 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లైంది. మరోవైపు, సోదాల విషయమై మంత్రి ఆలంను మీడియా ప్రతినిధులు సంప్రదించగా.. ‘‘ఈ విషయమై ఇప్పటివరకు నాకెలాంటి అధికారిక సమాచారం లేదు. నేనూ టీవీ చూస్తున్నాను. సోదాలు జరుగుతున్న ప్రాంతంతో ప్రభుత్వం నాకు సమకూర్చిన అధికారిక ప్రైవేటు కార్యదర్శికి (పీఎస్‌) సంబంధమున్నట్లు పేర్కొంటున్నారు’’ అని చెప్పారు. 70 ఏళ్ల ఆలం  పాకుర్‌ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాష్ట్రాన్ని లూట్‌ఖండ్‌గా మార్చేశాయి: భాజపా

కాంగ్రెస్‌, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఆర్జేడీ పార్టీలు ఝార్ఖండ్‌ రాష్ట్రాన్ని ‘లూట్‌ఖండ్‌’గా మార్చేశాయని భాజపా ఎంపీ దీపక్‌ ప్రకాశ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ఇంకా అవినీతి ముగిసిపోలేదని, ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా విపక్ష నేతలు ఈ డబ్బును ఉపయోగించాలనే యోచనలో ఉన్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘‘కల్పనా సోరెన్‌..  ఇప్పుడు ప్రశ్నలు అడగడానికి బదులు, ఝార్ఖండ్‌ను, పేద దళితులు, గిరిజనులను మీ భర్త ఎలా దోచుకున్నారో ప్రజలకు చెప్పండి. ఇలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినందునే ప్రస్తుతం ఆయన కటకటాల వెనక ఉన్నారు’’ అని ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ ట్విటర్‌ వేదికగా విమర్శించారు.

కీలక పత్రాలు కూడా..

నగదు స్వాధీనం చేసుకున్న ఫ్లాట్‌ నుంచి ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. వీటిలో గతేడాది మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రాంచీ విభాగం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖ ఉంది. గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకోవడానికి సంబంధించి బహిర్గతమైన అంశాలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈడీ అందులో కోరింది. దీంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు.. ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి మంత్రి ఆలంకు రాసిన లేఖలను కూడా అధికారులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని