న్యాయాధికారుల రిక్రూట్‌మెంట్‌లో గడువుకు కట్టుబడరేం?

న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది.

Updated : 07 May 2024 05:55 IST

రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

దిల్లీ: న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. మొత్తం 25 రాష్ట్రాలకు గాను 9 రాష్ట్రాలు మాత్రమే గడువులోగా సివిల్‌ జడ్జీల నియామక ప్రక్రియను పూర్తి చేశాయని పేర్కొంది. జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో ఖాళీల భర్తీకి సర్వోన్నత న్యాయస్థానం ఒక కాలావధిని నిర్దేశించింది. దీనిప్రకారం.. ఈ ప్రక్రియ మార్చి 31న ప్రారంభమై, అదే ఏడాది అక్టోబరు 31న ముగిసిపోవాలి. అయితే కొన్ని హైకోర్టుల విజ్ఞప్తి మేరకు ఈ షెడ్యూల్‌ను కొద్దిగా మార్చారు. ‘‘నిర్దేశిత గడువుకు అనుగుణంగా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరగాలి. ఏదైనా ప్రత్యేక, అనివార్య పరిస్థితులు ఎదురైనప్పుడు సంబంధీకులందరికీ సకాలంలో తెలియజేయాలి’’ అని జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బిహార్‌, గుజరాత్‌లో న్యాయాధికారుల ఎంపిక ప్రక్రియలో వైవాకు కనీస అర్హత మార్కులను నిర్దేశించడాన్ని సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పు వెలువరించింది. అందులో తాజా వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారుల నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి బిహార్‌.. 945 రోజులు తీసుకుందని ఆక్షేపించింది. జ్యుడీషియల్‌ సర్వీసు పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని