అహ్మదాబాద్‌లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు

గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరగనున్న వేళ అహ్మదాబాద్‌లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

Published : 07 May 2024 04:28 IST

తనిఖీలు చేసి ఉత్తిదేనని తేల్చిన పోలీసులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరగనున్న వేళ అహ్మదాబాద్‌లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇందులోని 11 పాఠశాలల్లో పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ  నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద వస్తువులేవీ లభ్యం కాలేదని వెల్లడించారు. సోమవారం ఉదయం 16 పాఠశాలలకు ఈ-మెయిల్‌లో బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు బాంబు నిర్వీర్య దళం, డాగ్‌ స్క్వాడ్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ బృందాలతో అక్కడికి చేరుకుని క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అహ్మదాబాద్‌ సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ తెలిపింది. రష్యా డొమైన్‌ నుంచి ఈ-మెయిల్‌ వచ్చినట్లు వెల్లడించింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా వచ్చి ఓటు వేయాలని ఓ ప్రకటనలో పేర్కొంది.

భద్రత పెంచండి: కేంద్ర హోం శాఖ కార్యదర్శి

ఇటీవల దిల్లీలోని 150కి పైగా పాఠశాలలకూ ఈ-మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సోమవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల వద్ద భద్రత పెంచడంతోపాటు సీసీటీవీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు వచ్చే ఈ-మెయిళ్లను నిరంతరం వర్యవేక్షించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు ఎదురైతే అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని