Wuhan: వుహాన్‌పై ‘డ్రాస్టిక్‌’ చెప్పిన విషయాలు..!

వుహాన్‌ ల్యాబ్‌ లీకు విషయంలో ఒక ఓపెన్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ చైనాకు కొరకరాని కొయ్యగా మారింది. కొవిడ్‌-19 పుట్టుకపై అధ్యయనం చేసేందుకు

Updated : 07 Jun 2021 18:02 IST

 22,000 వైరస్‌ నమూనాల సమాచారం మాయం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

వుహాన్‌ ల్యాబ్‌ లీకు విషయంలో ఒక ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ చైనాకు కొరకరాని కొయ్యగా మారింది. కొవిడ్‌-19 పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ఉత్సాహవంతులు కలిసి దీనిని ఏర్పాటు చేశారు. డ్రాస్టిక్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ గ్రూపు.. వుహాన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, పత్రాలను బహిర్గతం చేస్తోంది. దీనిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు.  వుహాన్‌ ల్యాబ్‌ వైరస్‌ డేటా బేస్‌ను కొవిడ్‌ వెలుగులోకి రావడానికి మూడు నెలల ముందు ఆన్‌లైన్‌ నుంచి తొలగించడాన్ని ఈ గ్రూప్‌ ప్రశ్నిస్తోంది.

హ్యాకర్ల ముప్పుగా చెబుతున్న చైనా..

2019లో కరోనావైరస్‌ సమాచారాన్ని ఆన్‌లైన్‌ నుంచి చైనా తొలగించింది.  దీనిలో 22,000 వైరస్‌ నమూనాల సమాచారం ఉంది. వీటి జన్యుక్రమాల వివరాలు కూడా ఉన్నాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు బృందం వెళ్లినప్పుడు.. చైనా శాస్త్రవేత్త షీజింగ్‌ లీని ఈ అంశంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దానికి ఆమె.. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉండటంతో ఆ సమాచారం కోసం హ్యాకర్లు యత్నాలు చేస్తున్నారనీ..  ఆ కారణంగా ఆన్‌లైన్‌ నుంచి ఆ డేటాను తొలగించినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ డేటాను 2019లో సెప్టెంబర్‌లో తొలగించారు. అంటే వైరస్‌ వ్యాప్తి బాహ్యప్రపంచానికి తెలియడానికి దాదాపు మూడు నెలల ముందన్నమాట. అప్పుడు కొవిడ్‌19 గురించి ప్రపంచానికి తెలియదు కదా..? హ్యాకర్లు ఆ సమాచారం కోసం ఎందుకు ప్రయత్నిస్తారు..? లేకపోతే సెప్టెంబర్‌లోనే షీజింగ్‌ లీకు వైరస్‌ వ్యాప్తి విషయం తెలిసి ఉండాలి. ఎందుకంటే కొవిడ్‌-19 చైనా చెబుతున్నట్లు డిసెంబర్‌లో మొదలు కాలేదని దాని జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

2018లో అమెరికా ఆందోళన..

వుహాన్‌ పేరుకు మాత్రమే పీ-4 స్థాయి ప్రయోగశాల. అక్కడ కనీసం భద్రతా చర్యలు కూడా తీసుకోరనే ఆరోపణలు గతం నుంచే ఉన్నాయి. ఆ ల్యాబ్‌ను అమెరికాకు చెందిన కొందరు అధికారులు 2018లో సందర్శించారు. ఈ క్రమంలో వారు అక్కడి భద్రతా ప్రమాణాల్లో లోపాలను గుర్తించారు. అక్కడ పనిచేసే వారికి కూడా ప్రొటోకాల్స్‌ పాటించే విషయంలో సరైన శిక్షణ లేదని గమనించారు. ఆ ల్యాబ్‌లో వైరస్‌లను భద్రపర్చే రిఫ్రిజిరేటర్‌ దెబ్బతిన్న చిత్రాన్ని గతేడాది పశ్చిమ దేశాల పత్రికలు ప్రచురించాయి. 

చైనా సైనిక కార్యకలాపాలు..

వుహాన్‌ ల్యాబ్లో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ జోక్యం ఎక్కువగానే ఉందని గతేడాది ‘ఎపోక్‌టైమ్స్‌’ పత్రిక కథనం పేర్కొంది. దాని ప్రకారం.. 2002లో సార్స్‌ వ్యాపించడంతో.. భవిష్యత్తులో ఇటువంటి వైరస్‌లను అడ్డుకోవడానికి పీ4ల్యాబ్‌ నిర్మించేందుకు సాయం చేయాలని ఫ్రాన్స్‌ను ‘ది చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ కోరింది. దీనికి నాటి ఫ్రాన్స్‌ ప్రధాని రాఫారిన్‌ అంగీకరించారు. దీనికి ఫ్రాన్స్‌కు చెందిన ఆర్టీవీ అనే సంస్థ ఇంజినీరింగ్‌ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ, దానిని తొలగించి చైనా సైన్యంతో సంబంధాలున్న ఐపీపీఆర్‌ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత నుంచి అక్కడ బయోకెమికల్‌ ఆయుధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయని ఫ్రాన్స్‌ అనుమానిస్తోందని ఈ కథనం పేర్కొంది.

వైరస్ లీకవ్వగానే సైన్యం రంగ ప్రవేశం..  

వుహాన్‌లో కరోనావైరస్ వ్యాపించిన సమయంలో  జంతువుల నుంచి వచ్చిన అంటు రోగంగా ప్రచారం జరుగుతున్న సమయంలో వుహాన్‌ ల్యాబ్‌ నిర్వహణను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ చేతుల్లోకి తీసుకొంది. జనవరి 2వ తేదీనే వుహాన్‌లో వ్యాపించిన గుర్తుతెలియని  నిమోనియా గురించిన వివరాలు ఎక్కడా మాట్లాడకూడదని ల్యాబ్‌ డీజీ నుంచి అందరికీ ఆదేశాలు వెళ్లాయి. పైగా దానికి సంబంధించిన పరిశోధన పత్రాలు ప్రచురించవద్దని పేర్కొన్నారు. పక్షం రోజుల తర్వాత ఆ ల్యాబ్‌ పగ్గాలను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బయోకెమికల్‌ నిపుణురాలు చెన్‌ వుయ్‌ చేతికి ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులకే  చైనాలో బయో సెక్యూరిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని  అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌  ప్రకటించారు. అక్కడి వైరస్‌ నమూనాల మొత్తాన్ని సీల్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ పనిచేసిన ఒక మహిళా ఉద్యోగి వివరాలను ఇన్‌స్టిట్యూట్‌ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఆమె తొలి పేషెంట్‌ అనే అనుమానాలు ఉన్నట్లు నాటి ‘ఎపోక్‌ టైమ్స్‌’ కథనంలో పేర్కొంది.  ఇక వైరస్‌ వ్యాప్తి విషయాన్ని బాహ్య ప్రపంచానికి వెల్లడించిన డాక్టర్‌ లీ వెన్‌లియాంగ్‌ వంటి వారిని చైనా ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. వాస్తవానికి నికార్సైన దర్యాప్తు జరిగి వాస్తవాలు తెలిసేవరకూ వుహాన్‌ ల్యాబ్‌పై అనుమానపు మేఘాలు కమ్ముకునే ఉంటాయి. మరోపక్క చైనా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తునకు అనుమతి ఇవ్వకపోవచ్చు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని