Wildfire: కాలిఫోర్నియాను కమ్మేసిన కార్చిచ్చు

అతిపెద్ద కార్చిచ్చు అమెరికాలోని కాలిఫోర్నియాలో బీభత్సం సృష్టిస్తోంది. లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద అగ్నికి ఆహుతవుతోంది. 108 ఏళ్లలో అత్యంత తీవ్రంగా చెప్పుకుంటున్న ఈ కార్చిచ్చుకు తోడు....

Published : 13 Jul 2021 22:21 IST

లక్షల ఎకరాల అటవీ సందప ఆగ్నికి ఆహుతి

కాలిఫోర్నియా: అతిపెద్ద కార్చిచ్చు అమెరికాలోని కాలిఫోర్నియాలో బీభత్సం సృష్టిస్తోంది. లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద అగ్నికి ఆహుతవుతోంది. 108 ఏళ్లలో అత్యంత తీవ్రంగా చెప్పుకుంటున్న ఈ కార్చిచ్చుకు తోడు పెద్దఎత్తున వేడి గాలులు తోడయ్యాయి. దీని కారణంగా పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దావాగ్నిని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా అగ్నిమాపక దళం తీవ్రంగా కృషి చేస్తోంది.

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పటికే పది రాష్ట్రాలకు దావానలంలా వ్యాపించింది. అలస్కా నుంచి వ్యోమింగ్‌ వరకు ఉన్న అడవిని దహించి వేస్తోంది. దాదాపు 60 ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలిఫోర్నియాలో భారీగా ఎగసిపడుతున్న మంటల ధాటికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. అరిజోనా, ఇడాహో, మోంటానా రాష్ట్రాల్లోని అధిక అటవీ భాగాన్ని మంటలు ఆక్రమించేశాయి. మంటల ధాటికి అనేక ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని అమెరికా వాతావరణ విభాగం తెలిపింది. జులై 13 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు ప్రకటించినా.. కాలిఫోర్నియా సహా కొన్ని రాష్ట్రాల్లో ఆ సూచనలు కనిపించలేదు.

రెండు వేల ఇళ్లు దగ్ధం 

మంటలకు భారీ వేడిగాలులు తోడవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. వేడిగాలుల ధాటికి మరింతగా ఎగసిపడుతున్న మంటలు వృక్ష సంపద, జంతుజాలాన్ని హరించివేస్తోంది. ఫ్లూమాస్‌ నేషనల్‌ ఫారెస్ట్‌లో 362 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని మంటలు ఆక్రమించాయని యోస్మైట్‌ నేషనల్‌ పార్క్‌లో 36 చదరపు కిలోమీటర్ల పరిధిలో దావాగ్ని వ్యాపించిందని అమెరికా అటవీ అధికారులు తెలిపారు. క్లామత్‌ కౌంటీ పట్టణంలోని ఫ్రీమాంట్‌ వైన్మా నేషనల్‌ పారెస్ట్‌లో 621 చదరపు కిలోమీటర్ల అడవిని మంటలు చుట్టుముట్టాయి. ఇప్పటివరకు రెండు వేల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు వెల్లడించారు. నెవెడా అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో మూడువేల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

1500 మంది అగ్నిమాపక సిబ్బంది

కార్చిచ్చు, వేడి గాలలు ప్రభావానికి కాలిఫోర్నియా ఉత్తర పర్వత ప్రాంతాల్లోని నివాస గృహాలు పెద్ద ఎత్తున ప్రభావితమయ్యాయి. మంటలు ఎగసిపడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కార్చిచ్చును అదుపుచేసేందుకు అమెరికా అగ్నిమాపక దళం తీవ్రంగా కృషిచేస్తోంది. 1500 మంది సిబ్బంది మంటలను నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. వేలాది అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కొన్ని చోట్ల విమానాల సాయంతో మంటలపై నీటిని కురిపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని