Bengaluru Blast: రామేశ్వరం కెఫే కేసు.. రాజకీయ ప్రకటనలు మానుకోండి..! సీఎం సిద్ధరామయ్య

రామేశ్వరం కెఫేలో (Rameshwaram Cafe Blast) చోటుచేసుకున్న బాంబు దాడి కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని.. దీనిపై రాజకీయ ప్రకటనలు మానుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Published : 03 Mar 2024 17:48 IST

చిక్కమంగళూరు: బెంగళూరు రామేశ్వరం కెఫేలో (Rameshwaram Cafe Blast) చోటుచేసుకున్న బాంబు దాడి కేసులో ప్రస్తుతం సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (CCB) దర్యాప్తు చేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోందని.. అవసరమైతే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఘటనపై ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని భాజపా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో సీఎం (Siddaramaiah) ఈ విధంగా స్పందించారు.

పరిచయం లేని మహిళను అలా పిలవడం లైంగిక వేధింపే: కలకత్తా హైకోర్టు

‘కెఫే ఘటనపై ఇప్పుడే దర్యాప్తు మొదలయ్యింది. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు. అవసరమైతే ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తాం. బాంబు పేలుడు వంటివి చిన్న ఘటనలు కావు. ఇటువంటి వాటిపై (భాజపా) నాయకులు రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు మానుకోవాలి’ అని సిద్ధరామయ్య అన్నారు. భాజపా అధికారంలో ఉన్న సమయంలోనూ పేలుళ్లు జరిగాయన్న ఆయన.. అలాంటి వాటిని తాము రాజకీయంగా చూడలేదన్నారు. మంగళూరులో 2022లో ప్రెజర్‌ కుక్కర్‌ పేలుడు ఘటన చోటుచేసుకుంది. దానికి తాజా ఘటనతో ఏమైనా సంబంధముందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోందన్నారు.

ఇడ్లీ ఆర్డర్‌ చేసుకొని.. టైమర్‌ ఆన్‌ చేసి!

ఘటన జరిగిన రామేశ్వరం కెఫేని శనివారం పరిశీలించిన సీఎం సిద్ధరామయ్య.. ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మాస్కు, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో వచ్చాడు. కౌంటర్‌ నుంచి రవ్వా ఇడ్లీ కొని కెఫేలో ఓ చోట కూర్చున్నాడు. తర్వాత టైమర్‌ సెట్‌ చేసి వెళ్లిపోయాడు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని